Gopalapuram: మహిళలకు కూరగాయల విత్తన కిట్లు పంపిణీ

Gopalapuram: తూర్పుగోదావరి జిల్లా వాదలకుంటలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్రలో భాగంగా 300 మంది SHG మహిళలకు కూరగాయల విత్తన కిట్లు పంపిణీ చేశారు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM
Updated on: 3 Sept 2026 11:18 PM IST
Gopalapuram
X

Gopalapuram: మహిళలకు కూరగాయల విత్తన కిట్లు పంపిణీ

గోపాలపురం: తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వాదలకుంట గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మహిళలకు కూరగాయల విత్తనాల కిట్లను పంపిణీ చేశారు. గ్రామంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ ఆరోగ్యంతో పాటు పిల్లలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ఇంటి పెరట్లోనే సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలను పండించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వాదలకుంట గ్రామానికి చెందిన 300 మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 300 కూరగాయల విత్తనాల కిట్లను అందజేశారు. ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో వివిధ రకాల కూరగాయల విత్తనాలను కిట్లుగా ప్యాకింగ్ చేసి మహిళలకు పంపిణీ చేశారు.

గ్రామ పెద్దలు, రైతులు గడా జోగేంద్ర ప్రసాద్, జొన్నగడ్ల రాంబాబు, వడ్లమూడి రమేష్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. విత్తనాల కిట్లను గడా జోగేంద్ర ప్రసాద్ మహిళా సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంటీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాల్లో ఖాళీ స్థలాన్ని వినియోగించుకుని కూరగాయలను స్వయంగా పండించుకోవాలని సూచించారు. ఇంటి పెరట్లో పండించిన తాజా కూరగాయలను వినియోగించడం ద్వారా కుటుంబానికి పోషకాహారం అందడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ మహిళలు ముందుకు రావాలని కోరారు.

కూరగాయల సాగుపై మహిళలకు అవగాహన కల్పించడంతో పాటు, విత్తనాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన పంటలను పండించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంటీ శ్రీనివాస్, వాదలకుంట యూనిట్ సభ్యులు, ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు పాల్గొన్నారు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

Next Story