Polavaram: పోలవరం జిల్లాలో రెండు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు!
Polavaram: పోలవరం జిల్లాలోని 12 మండలాల పరిధిలో ఉన్న 186 గ్రామ పంచాయతీలకు నవంబర్ 26, 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.
Polavaram: పోలవరం జిల్లాలో రెండు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు!
Polavaram: పోలవరం జిల్లాలోని 12 మండలాల పరిధిలో ఉన్న 186 గ్రామ పంచాయతీలకు రెండవ సాధారణ ఎన్నికలు–2026ను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో మొత్తం 1,734 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 2,78,545 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. మొదటి దశ ఎన్నికలు నవంబర్ 26న, రెండవ దశ ఎన్నికలు నవంబర్ 29న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
రెండు దశల్లోనూ పోలింగ్ ముగిసిన అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగు, అనంతరం 2 గంటల నుంచి కౌంటింగ్ అదే పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తారని తెలిపారు.
మొదటి దశ నవంబర్ 26 న 5 మండలాల్లో అడ్డతీగల (22) , దేవీపట్నం (14) , గంగవరం (17) , రాజవొమ్మంగి (19) , రంపచోడవరం (19) గ్రామాల్లో మొత్తం 91 గ్రామ పంచాయతీ లలో పోలింగు నిర్వహించనున్నట్లు తెలిపారు .
అదే విధంగా రెండవ ద నవంబర్ 29 న ఏడు మండలాల్లో గుర్తేడు (5) , వై.రామవరం (12) , చింతూరు (18) , మారేడుమిల్లి (12) , కూనవరం (16) , వి.ఆర్. పురం (11) , ఏటపాక (21) గ్రామాల్లో మొత్తం 95 గ్రామ పంచాయతీ లలో పోలింగు నిర్వహించనున్నట్లు తెలిపారు .
మొదటి దశలో భాగంగా నవంబర్ 13న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. నవంబర్ 15న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ప్రకటన విడుదల చేస్తారని తెలిపారు. నవంబర్ 17వ తేదీ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ కాగా, నవంబర్ 18న నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తారని పేర్కొన్నారు.
తిరస్కరించిన నామినేషన్లపై నవంబర్ 19న అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, నవంబర్ 20న అప్పీళ్ల పరిష్కారం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థిత్వాల ఉపసంహరణకు నవంబర్ 21 చివరి తేదీగా నిర్ణయించారని, అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారని వెల్లడించారు. నవంబర్ 26న పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన నిర్వహించనున్నట్లు తెలిపారు.
రెండవ దశలో భాగంగా నవంబర్ 16న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుండగా, నవంబర్ 18న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ప్రకటన విడుదల చేస్తారని కలెక్టర్ తెలిపారు. నవంబర్ 20వ తేదీ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా, నవంబర్ 21న నామినేషన్ల పరిశీలనగా నిర్ణయించారని పేర్కొన్నారు.
తిరస్కరించిన నామినేషన్లపై నవంబర్ 22న అప్పీల్ చేసుకోవచ్చని, నవంబర్ 23న అప్పీళ్ల పరిష్కారం ఉంటుందని తెలిపారు. అభ్యర్థిత్వాల ఉపసంహరణకు నవంబర్ 24 చివరి తేదీ కాగా, అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారని వెల్లడించారు. నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కె. దినేష్ కుమార్ వివరించారు.




