Malikipuram: ఖతర్‌లో మృతి చెందిన శ్రీదేవి మృతదేహం స్వగ్రామానికి చేరిక
Malikipuram: కుటుంబ పోషణ కోసం ఖతర్ వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన కోనసీమ జిల్లాకు చెందిన వలస కార్మికురాలు దొండపాటి శ్రీదేవి.
Malikipuram: ఖతర్‌లో మృతి చెందిన శ్రీదేవి మృతదేహం స్వగ్రామానికి చేరిక
మలికిపురం: కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే ఆశతో విదేశాలకు వెళ్లిన ఓ మహిళా కార్మికురాలు ప్రమాదవశాత్తూ మృతి చెందగా, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వ విభాగాల సమిష్టి కృషితో ఆమె మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. డాక్టర్.బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన దొండపాటి శ్రీదేవి మృతదేహం గురువారం ఖతర్ నుండి స్వగ్రామానికి తీసుకువచ్చారు.
కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం ఖతర్‌కు వెళ్లిన శ్రీదేవి అక్కడ ఓ నివాస గృహంలో పనిచేస్తున్నారు. విధుల్లో ఉండగా బాత్రూంలో కాలుజారి పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాదాపు 15 రోజుల పాటు అత్యవసర విభాగంలో చికిత్స పొందిన అనంతరం బ్రెయిన్ డెడ్ కావడంతో ఈ నెల 19వ తేదీన ఆమె కన్నుమూశారు.
శ్రీదేవి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మృతదేహాన్ని ఖతర్ నుండి భారతదేశానికి, అక్కడి నుంచి స్వగ్రామానికి తరలించేందుకు అవసరమైన ఖర్చులు భరించే స్థోమత లేకపోవడంతో వారు నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ (NWWT)ను ఆశ్రయించారు.
బాధిత కుటుంబ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన NWWT ప్రతినిధులు, APNRTS మరియు ఖతర్ తెలుగు సొసైటీ సభ్యులతో సమన్వయం చేసి అవసరమైన పత్రాలు, అనుమతులను వేగంగా పూర్తి చేశారు. వారి కృషి ఫలితంగా శ్రీదేవి మృతదేహాన్ని విజయవాడ విమానాశ్రయం మీదుగా విశ్వేశ్వరాయపురం గ్రామానికి సురక్షితంగా తరలించారు.
ఈ సందర్భంగా తమ కష్టకాలంలో అండగా నిలిచి మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించడంలో సహకరించిన NWWT చైర్‌పర్సన్ లిస్సీ జోసెఫ్, ఖతర్ తెలుగు సొసైటీ సభ్యులు నరసింహం, APNRTS ప్రతినిధులు, NWWT జిల్లా ఇన్‌ఛార్జ్ మోహన్, మలికిపురం మండల ఫీల్డ్ ఫెసిలిటేటర్ అరుణలకు శ్రీదేవి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




