Rajahmundry: బియ్యం ధరల నియంత్రణకు చర్యలు జేసీ మేఘా స్వరూప్ హెచ్చరిక!
Rajahmundry: తూర్పుగోదావరి జిల్లాలో బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ హెచ్చరిక.
Rajahmundry: బియ్యం ధరల నియంత్రణకు చర్యలు జేసీ మేఘా స్వరూప్ హెచ్చరిక!
Rajahmundry: రాష్ట్రంలో బియ్యం ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు సరసమైన ధరలకు బియ్యం అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు, ప్రైవేటు రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, వివిధ రకాల బియ్యానికి కిలో గరిష్ఠ రిటైల్ ధరలను నిర్ణయించినట్లు పేర్కొన్నారు. బియ్యం రకాల వారీగా BPT-3291 (సోనా), BPT-5204 (సాంబా), KNM రకాల బియ్యం కిలో రూ.66, HMT, RNR రకాల బియ్యం కిలో రూ.76, జై శ్రీరామ్ రకం కిలో రూ.82, MTU రకాల కామన్ బియ్యం కిలో రూ.47 చొప్పున విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఉల్లంఘనలు జరిగితే చర్యలు తప్పవు
నిర్ణయించిన ధరలను ప్యాకేజీ బియ్యం బస్తాలపై గరిష్ఠ చిల్లర ధర (MRP)గా ముద్రించేందుకు వ్యాపారులు, ప్రైవేటు రైస్ మిల్లర్లు అంగీకరించినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఒకే రకం బియ్యానికి కేవలం బ్రాండ్ పేరు లేదా బ్రాండ్ విలువ ఆధారంగా అదనపు ధర వసూలు చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. జిల్లాలో నిర్ణయించిన ధరలు పక్కాగా అమలయ్యేలా జిల్లా పౌరసరఫరాల అధికారులు హోల్‌సేల్, రిటైల్ బియ్యం దుకాణాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్యాకేజీ బియ్యం బస్తాలపై ముద్రించిన MRPని పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలు ముద్రించినట్లు గుర్తిస్తే సంబంధిత ప్యాకింగ్ యూనిట్లను గుర్తించి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. లీగల్ మెట్రాలజీ అధికారులు కూడా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, MRP నిబంధనలను ఉల్లంఘించిన వారిపై లీగల్ మెట్రాలజీ చట్టం–2009, లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధనలు–2011 ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ధరల వివరాలను దుకాణాల్లో ప్రదర్శించాలి
బియ్యం విక్రయించే అన్ని దుకాణాల్లో నిర్ణయించిన ధరల వివరాలను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. నిర్ణయించిన ధరల కంటే అధికంగా బియ్యం విక్రయించడం, ఒకే రకం బియ్యానికి బ్రాండ్ పేరుతో అదనపు ధర వసూలు చేయడం, ప్యాకేజీలపై అధిక MRP ముద్రించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే సంబంధిత అధికారుల ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వినియోగదారుల నుంచి అధిక ధరలపై అందే ఫిర్యాదులను వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా పౌరసరఫరాలు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.




