Amalapuram: గోదావరి మహా పుష్కరాలు 2027!
Amalapuram: 2027 గోదావరి మహా పుష్కరాల ముందస్తు ఏర్పాట్లపై కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
Amalapuram: గోదావరి మహా పుష్కరాలు 2027!
అమలాపురం: 2027లో నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాల ముందస్తు ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవి శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
కొత్తగా ఏర్పాటైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తొలిసారిగా జరగనున్న మహా పుష్కరాలను గత అనుభవాలను సమన్వయం చేసుకుని విజయవంతంగా నిర్వహించాలని ఆమె అధికారులకు సూచించారు.
జలవనరులు, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, దేవాదాయ, సివిల్ సప్లైస్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ట్రాన్స్‌కో, పోలీస్ తదితర శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. శాఖల వారీగా చేపట్టాల్సిన సివిల్ వర్క్స్ ప్రతిపాదనలు, మౌలిక వసతుల కల్పనపై విస్తృతంగా చర్చించారు.
జిల్లాలోని పుష్కర ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు, రహదారుల అభివృద్ధి, శాశ్వత ఘాట్ల బలోపేతం, రక్షణ గోడలు, అప్రోచ్ రోడ్లు, తాత్కాలిక దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు అంచనా వ్యయాలతో త్వరగా సమర్పించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్, బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై పోలీస్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని సూచించారు. ప్రధాన ఘాట్ల వద్ద వుడెన్ బారికేడింగ్ ఏర్పాటు చేసి, మూడు షిఫ్టుల్లో పోలీస్, రెవెన్యూ తదితర శాఖల సిబ్బందిని నియమించాలని తెలిపారు.
పుష్కరాల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిధుల వినియోగంలో పారదర్శకత ఉండేలా అంచనాలు రూపొందించి సకాలంలో టెండర్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన ఘాట్ల వద్ద నిర్వహించే 11 రకాల పూజా కార్యక్రమాలకు అవసరమైన పూజా సామగ్రిని ధరల నియంత్రణ కమిటీ పర్యవేక్షణలో డ్వాక్రా మహిళల ద్వారా విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖ స్వామీజీలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
భక్తుల భద్రత కోసం మత్స్యశాఖ ఆధ్వర్యంలో పడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, అగ్నిమాపక శాఖ ఘాట్ల వద్ద ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని తెలిపారు.
విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా, లైటింగ్, పీఏ సిస్టం ఏర్పాట్లు చేయాలని, ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని, రవాణా శాఖ భారీ వాహనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఘాట్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణతో పాటు భక్తులకు మార్గదర్శకంగా సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఆర్ఓ వి. సుబ్బారావు, అడ్మిన్ ఎస్పీ మహేంద్ర మత్తె, ఆర్డీవో ఏ. సరళాదేవి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.




