Kadiyam: కడియంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌కు ఘన సన్మానం

Kadiyam: కడియం మండల పరిషత్ సభ్యుల పదవీ విరమణ సభలో మాజీ ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌ను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘనంగా సత్కరించారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 1 Oct 2026 7:15 PM IST
Kadiyam
X

Kadiyam: కడియంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌కు ఘన సన్మానం

కడియం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయిందని, కానీ ఐదు సంవత్సరాల క్రితమే కూటమిగా పోటీ చేసి మండల పరిషత్ ఏర్పాటు చేసిన ఘనత కడియం మండల పరిషత్ పాలకవర్గ సభ్యులకు దక్కుతుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గురువారం మండల కేంద్రమైన కడియం జిఎన్ఆర్ కళ్యాణ మండపంలో మండల పరిషత్ సభ్యులు పదవీ విరమణ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీపీగా పదవీ విరమణ చేసిన వెలుగుబంటి ప్రసాద్ ను భారీ గజమాలతో, పూల కిరీటాలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఎల్ఏ గోరంట్ల మాట్లాడుతూ వెలుగుబంటి ప్రసాద్ ఎంపీపీ పదవి చేపట్టినప్పటి నుండి కడియం మండల అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ, తన మన అంటూ వర్గ అభిప్రాయాలు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా కష్టపడ్డారని, ప్రణాళికతో పనిచేశారని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో టిడిపి తరఫున రాష్ట్రంలో ఎన్నికైన ఏకైక ఎంపీపీ వెలుగుబంటి ప్రసాదే అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమిగా పోటీ చేసి, 100 శాతం విజయం సాధించాలని, మరలా మీ అందరి సహకారంతో మండల అభివృద్ధి కొనసాగాలని అన్నారు.

వెలుగుబంటి ప్రసాద్ మాట్లాడుతూ ఎంపీపీ పదవి చేపట్టి ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ, మొదటి రెండున్నర సంవత్సరాలు అలంకారప్రాయంగా మాత్రమే ఉందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కడియం మండలం అభివృద్ధి పథంలోకి వచ్చిందన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో సుమారు 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ శ్రీనివాస్ యాదవ్, కూటమి నాయకులు గోరంట్ల రవి రామ్ కిరణ్, మార్గాని సత్యనారాయణ, గట్టి నరసయ్య, పాఠంశెట్టి రాంజీ, పంతం గణపతి, వెలుగుబంటి నాని, ముద్రగడ జెమీ, చెల్లుబోయిన శ్రీనివాస్, మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL