Kadiyam: కడియంలో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
Kadiyam: కడియం మండలంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ మండల అధ్యక్షుడు వెలుగుబంటి నాని దంపతులు కలశస్థాపన చేశారు.
Kadiyam: కడియంలో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
కడియం: శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా కడియం మండలంలోని వివిధ గ్రామాలలో, అమ్మవారి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రమైన కడియం బొబ్బిలి బ్రిడ్జ్ సెంటర్ వద్ద వెలసిన శ్రీ దేవి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలు రంగురంగుల లైటింగ్ సెట్టింగ్ లతో, భక్తుల సమూహాలతో కళకళలాడుతున్నాయి.
ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండే అమ్మవారికి కుంకుమ పూజలు అభిషేకాలు నిర్వహించారు. కడియం దేవి ఆలయం వద్ద మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని, లక్ష్మీ అన్నపూర్ణ దంపతుల ఆధ్వర్యంలో కలశ స్థాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని కలశంలో ఆవాహన చేసి, తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు, అర్చనలు నిర్వహిస్తూ, తమ కుటుంబంతో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకుంటారు. దసరా ఉత్సవాల సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
నవరాత్రులలో మొదటి రోజైన ఆదివారం అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. నవరాత్రుల సందర్భంగా కడియం గ్రామానికి చెందిన శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ వారు అమ్మవారికి 120 కేజీల లడ్డుని ప్రసాదంగా సమర్పించారు.




