Rajahmundry: గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్
Rajahmundry: రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పీ శివప్రియ ఆదేశాలతో కడియం మండలంలో పోలీసులు గంజాయి ముఠాలపై దాడులు చేశారు.
Rajahmundry: గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్
Rajahmundry: కడియం మండలం లో గంజాయి సేవిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జూన్ 12వ తేదీ శుక్రవారం, రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పీ ఏ.శివప్రియ ఆధ్వర్యంలో కడియం సిఐ అల్లు వెంకటేశ్వరరావు తమ స్టేషన్ పోలీసు సిబ్బందితో కలిసి మండలంలోని అనుమానాస్పద ప్రాంతాలలో దాడులు నిర్వహించి, పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
వీరికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురు గంజాయి సేవించినట్లు ఫలితాలు వచ్చాయని, సుమారు రెండు కేజీలు గంజాయి దొరికి నట్లు మిగిలిన వారికి నెగిటివ్ ఫలితాలు వచ్చాయని సిఐ తెలిపారు. మండలంలోని కడియపుసావరం, మాధవరాయుడుపాలెం, వేమగిరి తోట గ్రామాలకు చెందిన ఆ ముగ్గురి యువకులను శనివారం రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
డిఎస్పీ ఆదేశాల మేరకు అనుమానిత యువకులకు శనివారం కూడా పరీక్షలు నిర్వహించి నట్లు సిఐ పేర్కొన్నారు. గంజాయి పరీక్షలు చేపట్టేందుకు తమ వద్ద కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే ప్రతి గ్రామంలోని అనుమానిత యువతను గుర్తించి గంజాయి పరీక్షలు నిర్వహిస్తామని, అనుమానిత ప్రాంతాల్లో దాడులు చేపడతామని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం చేపట్టిన దాడులు సందర్భంగా కొంతమంది యువతకు గంజాయి, మత్తు పదార్థాల వాడకం వలన కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించామన్నారు. గంజాయి సేవించినా , అమ్మకాలు సాగించినా, కఠిన శిక్షలు ఉంటాయని, ఎవరినీ ఉపేక్షించ బోమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని, జీవితాన్ని పాడు చేసుకోవద్దని హితవు పలికారు.
అలాగే మండలంలోని పలు అనుమానిత ప్రాంతాల పై నిఘా పెట్టి నట్లు తెలిపారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటి కప్పుడు గమనిస్తూ ఉండాలని, మైనర్ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అలాగే యువత తీరును ఆయా గ్రామాల పెద్దలు పర్యవేక్షించాలని సూచించారు.




