Rajahmundry: గోదావరి పుష్కరాలకు టెంట్ సిటీలు.. మంత్రి కందుల సమీక్ష
Rajahmundry: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలో టూరిజం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.
Rajahmundry: గోదావరి పుష్కరాలకు టెంట్ సిటీలు.. మంత్రి కందుల సమీక్ష
Rajahmundry: ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు మెరుగైన వసతి, పర్యాటక సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభమైంది. గోదావరి పుష్కరాల నాటికి ‘టెంట్ సిటీలు’, ‘హోమ్ స్టేలు’ సిద్ధంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని శ్రీ రతన్ టాటా హబ్‌లో రాజమహేంద్రవరం టూరిజం హబ్, ఏపీటీడీసీ కాకినాడ డివిజన్ అభివృద్ధిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించిన మంత్రి, పర్యాటక రంగ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గోదావరి పుష్కరాలకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు 21 ప్రధాన దేవాలయాల్లో టెంట్ సిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు.
భక్తులు దర్శనం పూర్తయ్యాక వెంటనే వెళ్లిపోకుండా అక్కడే బస చేసి సమీప ప్రాంతాలను సందర్శించేలా పర్యాటక హంగులు కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 50 వేల గదుల ఏర్పాటే లక్ష్యమని మంత్రి వెల్లడించారు. రాజమహేంద్రవరంలో లెమన్ ట్రీ వంటి ప్రముఖ హోటళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, అయితే టైర్-2, టైర్-3 పట్టణాల్లో స్టార్ హోటళ్లు అందుబాటులో లేని చోట ‘హోమ్ స్టే’ విధానాన్ని బలంగా ప్రోత్సహించాలని చెప్పారు.
“మీ ఇంట్లో ఒక గది ఖాళీగా ఉంటే అది కూడా హోమ్ స్టేగా మారవచ్చు” అని ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. పాతకాలపు మండువా లోగిళ్లు, విడిది ఇళ్లను హోమ్ స్టేలుగా మార్చడం ద్వారా గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు కొత్త అనుభవం కలుగుతుందని, అదే సమయంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి వివరించారు.
కేరళ కంటే మెరుగైన ప్రకృతి సంపద ఆంధ్రప్రదేశ్‌లో ఉందని, కానీ ప్రచారం లోపించిందని మంత్రి దుర్గేష్ అన్నారు. “కొంచెం ప్రచారం, మరికొంత పక్కా ప్రణాళిక ఉంటే ఏపీ పర్యాటకం ప్రపంచ స్థాయిలో నిలుస్తుంది” అని వ్యాఖ్యానించారు. గోదావరి టూరిజం సర్క్యూట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
ఇటీవల వైజాగ్ నుంచి అరకు వరకు ప్రారంభించిన కారవాన్ టూరిజంకు మంచి స్పందన వచ్చిందని, అదే తరహాలో గోదావరి జిల్లాల్లో కూడా కారవాన్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, హెలీ టూరిజం త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాకినాడ, ఉప్పాడ, పేరుపాలెం బీచ్‌లను బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ దిశగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.
పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం, కొత్త టూరిజం పాలసీ 2024-29, హోమ్ స్టే, క్యారవాన్, బి అండ్ బి వంటి వినూత్న విధానాల వల్ల ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారని మంత్రి తెలిపారు. గత ఏడాదిన్నరలోనే దాదాపు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు, 100కు పైగా ఎంవోయూలు కుదిరాయని వెల్లడించారు.
అసంపూర్తిగా ఉన్న పర్యాటక ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, నిర్వహణలో నిర్లక్ష్యం ఉంటే నోటీసులు ఇచ్చి అవసరమైతే ప్రాజెక్టులను రద్దు చేసి కొత్త వారికి అప్పగించాలని మంత్రి కఠినంగా హెచ్చరించారు.
గోదావరి పుష్కరాలను కేవలం ఆధ్యాత్మిక వేడుకగా కాకుండా, ప్రపంచ స్థాయి పర్యాటక అవకాశంగా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. భక్తులకు రాజమర్యాదలు, ప్రజలకు ఉపాధి, రాష్ట్రానికి ఆదాయం—ఈ మూడు లక్ష్యాలతో అమలు చేస్తున్న ఈ ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కొత్త దిశ చూపనున్నాయి.




