Kadiyam: కడియం పేపర్ మిల్లు కార్మికులకు మంత్రి కందుల దుర్గేష్ మద్దతు
Kadiyam: కడియం పేపర్ మిల్లులో అక్రమంగా తొలగించిన 70 మంది కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
Kadiyam: కడియం పేపర్ మిల్లు కార్మికులకు మంత్రి కందుల దుర్గేష్ మద్దతు
కడియం: కడియం పేపర్ మిల్లులో తొలగించిన 70 మంది పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి కందుల దుర్గేష్ డిమాండ్ చేశారు. పేపరుమిల్లులో తొలగించిన 70 మంది పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు గత 59 రోజులుగా పేపరుమిల్లు వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి కందుల దుర్గేష్ కార్మికులు చేపట్టిన ఆందోళన శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కడియం పేపరు మిల్లు యాజమాన్యం మొండి వైఖరితో వ్యవహరిస్తుందన్నారు. యాజమాన్యం వైఖరిని తీవ్రంగా ఖండించారు.
పరిశ్రమల స్థాపన ద్వారా పది మందికి ఉపాధి కల్పించే అంశంలో ఎటువంటి బేధాభిప్రాయాలు లేవన్నారు. అయితే పరిశ్రమ అభివృద్ధికి, యాజమాన్యానికి లాభాలు తెచ్చిపెడుతున్న కార్మికుల పట్ల యాజమాన్యం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారిని బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు.
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సిన యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ లాకౌట్‌ను ప్రకటించడం, కార్మికులను తొలగింపులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడుతుందన్నారు. ప్రభుత్వ చర్యలతో లాకౌట్‌ను ఎత్తివేసిన యాజమాన్యం 59 కాంట్రాక్టు కార్మికులను విధుల నుంచి తొలగించడం, వారికి మద్దతుగా నిలిచిన పర్మినెంట్ కార్మికులు 11 మందిని సైతం విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు.
ఈ అక్రమ తొలగింపులపై కార్మికులంతా ఐక్యంగా గత 59 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తాను కార్మికుల పొట్ట కొడుతుంటే ఎవరూ చూస్తూ ఉండరని, కార్మికులకు తన సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే యాజమాన్యంతో రెండు మూడు దఫాలు మాట్లాడానని, అలాగే ప్రిన్సిపల్ సెట్రకరీ, కార్మిక శాఖ కమిషనర్‌లతో మాట్లాడినట్లు తెలిపారు.
అయితే ఉన్నతాధికారులు, యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారని అన్నారు. ఈ నెల 30 వ తేదీ వరకూ వేచిచూస్తామని, ఈలోపు యాజమాన్యం మొండి వైఖరిని వీడి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని, అదేజరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్, జిల్లా అధ్యక్షులు ఎం.సుందర్ బాబు, కర్రి రామకృష్ణ, కె.వి.పి.ఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, పేపరుమిల్లు కార్మికులు పాల్గొన్నారు.




