Peravali: పార్టీలు, వర్గాలకు అతీతంగా ఖండవల్లి సర్పంచి ఏకగ్రీవం!

Peravali: తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి సర్పంచ్‌గా కడలి ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి దాతలు రూ.1.02 కోట్లు ప్రకటించారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE
Published on: 27 Nov 2026 7:57 PM IST
Peravali
X

Peravali: పార్టీలు, వర్గాలకు అతీతంగా ఖండవల్లి సర్పంచి ఏకగ్రీవం!

Peravali: పార్టీలు, వర్గాలకతీతంగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనులు చేపట్టాలనే లక్ష్యంతో గ్రామానికి చెందిన పారిశ్రామిక వేత్త శ్రీరామరాజు చొరవ చూపడంతో నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ఖండవల్లి సర్పంచి ఎన్నిక ఏకగ్రీమైంది. మండలంలో అతిపెద్ద గ్రామం. సుమారు 16 వేల మంది జనాభా, పదివేలకు పైగా ఓటర్లు ఉన్న ఖండవల్లి గ్రామం బీసీ మహిళ కేటగిరికి రిజర్వు అయింది.

సర్పంచ్ ఎన్నిక పార్టీలు, కులాలు, వర్గాలకు అతీతంగా జరగాలని పారిశ్రామికవేత్త భూపతి రాజు శ్రీరామరాజు ఓ ప్రతిపాదన పెట్టారు. అంతేకాకుండా గ్రామ అభివృద్ధికి, పారిశుధ్య నిర్వహణకు, సుందరీకరణకు సర్పంచి అభ్యర్థి ఎంత సొమ్ము ఇస్తే తాను కూడా అంతే ఇస్తానని ప్రకటించారు. దీంతో సర్పంచ్ అభ్యర్థి కడలి ధనలక్ష్మి రూ. 51 లక్షలు ఇస్తానని ప్రకటించడంతో శ్రీరామరాజు కూడా రూ. 51 లక్షలు ఇస్తానని ప్రకటించారు.

ఈ సొమ్ముతో గ్రామ పారిశుద్ధ్య కార్మికుల జీతాలతో పాటు డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ఇళ్ల నుంచి సేకరించిన చెత్త ద్వారా ఎరువు తయారుచేసి కొంతమందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రామంలో సోలార్ తో కూడిన వీది దీపాలు ఏర్పాటు, పచ్చదనం పరిశుభ్రత, బెల్ట్ షాపులు నిరాకరణ వంటి కార్యక్రమాలు చేపట్టి మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మితో పాటు 16 మంది వార్డు సభ్యులు తప్ప ఎవరు నామ పత్రాలు దాఖలు చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సంబంధిత ఎన్నికల అధికారులు వెల్లడించారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE