కొబ్బరి పీచు పరిశ్రమలకు ఊతం.. అమలాపురంలో ‘కోనసీమ క్వాయర్ కాంక్లేవ్’
Amalapuram: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి పీచు పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు జూలై 16, 17 తేదీల్లో ‘కోనసీమ క్వాయర్ కాంక్లేవ్’ నిర్వహించనున్నారు.
కొబ్బరి పీచు పరిశ్రమలకు ఊతం.. అమలాపురంలో ‘కోనసీమ క్వాయర్ కాంక్లేవ్’
అమలాపురం: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజల ప్రధాన జీవనోపాధి అయిన కొబ్బరి ఆధారంగా జిల్లాలో శక్తివంతమైన కొబ్బరి పీచు (క్వాయర్) పరిశ్రమల ఏర్పాటుకు పునాది వేయాలనే లక్ష్యంతో ఈ నెల 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు 'కోనసీమ క్వాయర్ కాంక్లేవ్' నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
జిల్లా కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన రెండో దఫా సన్నద్ధత సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సదస్సును విజయవంతం చేయాలని, వచ్చే మూడు నెలల్లో జిల్లాలో కనీసం 50 కొత్త క్వాయర్ పరిశ్రమలు స్థాపించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.
అనాతవరం కన్వెన్షన్ హాల్‌లో జరిగే ఈ సదస్సుకు కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 15 మంది నిపుణులు, ఉన్నతాధికారులు హాజరై క్వాయర్ పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ రాయితీలు, పథకాలు, ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పించనున్నారు. పరిశ్రమల స్థాపనపై ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలు, మహిళలు, యువతతో పాటు మొత్తం 350 మంది ప్రతినిధులను డీఆర్‌డీఏ, ఉద్యానశాఖ ద్వారా ఆహ్వానిస్తున్నారు.
ప్రతినిధుల సౌకర్యార్థం క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించగా, నమోదు సమయంలో కిట్‌లు అందజేయనున్నారు. సదస్సు వివరాలను ప్రతిరోజూ మీడియాకు ప్రత్యేకంగా వెల్లడించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
సదస్సు ప్రాంగణంలో క్వాయర్ బోర్డు, డీఆర్‌డీఏ, నాబార్డ్–ఎంఎస్‌ఎంఈ, జీఎం డీఐసీ, ఉద్యానశాఖ, లీడ్ బ్యాంక్, ఏపీఐఐసీ తదితర శాఖల ఆధ్వర్యంలో మొత్తం ఎనిమిది ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి పరిశ్రమల స్థాపన, రుణాలు, రాయితీలు, సాంకేతికత, భూ కేటాయింపులు తదితర అంశాలపై పూర్తి సమాచారం అందించనున్నారు.
జిల్లాలో ప్రస్తుతం లభ్యమవుతున్న కొబ్బరి పీచులో కేవలం 20 శాతం మాత్రమే వినియోగంలో ఉందని, మిగిలిన 80 శాతం వ్యర్థాలను సంపదగా మార్చేందుకు ఈ కాంక్లేవ్ కీలక వేదికగా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ పారిశ్రామికీకరణతో పాటు మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
'ఒక జిల్లా–ఒక ఉత్పత్తి' పథకం కింద కోనసీమ జిల్లాకు కొబ్బరి, కొబ్బరి పీచు ఉత్పత్తులకు గుర్తింపు లభించిందని, విలువ జోడింపు, అంతర్జాతీయ మార్కెటింగ్ అనుసంధానమే ఈ కాంక్లేవ్ ప్రధాన లక్ష్యమని వివరించారు.
జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవి మాట్లాడుతూ, ఈ సదస్సు ద్వారా ప్రత్యేక కొబ్బరి పీచు పార్క్, క్లస్టర్ అభివృద్ధి, ఉమ్మడి సౌకర్య కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. క్వాయర్ జియో టెక్స్‌టైల్స్, చాపలు, తాళ్లు, పర్యావరణహిత ఉత్పత్తుల తయారీ, నాణ్యతా ప్రమాణాలు, డిజిటల్ మార్కెటింగ్, ప్రభుత్వ సబ్సిడీలు, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలపై సమగ్ర శిక్షణ అందించనున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు, జిల్లా ఉద్యాన అధికారి బి.వి. రమణ, ఏపీఐఐసీ డీజీఎం రాధామణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ కేశవ వర్మ, నాబార్డ్ డీడీఎం స్వామినాయుడు, సిడ్బి ప్రోగ్రాం మేనేజర్ శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.




