Amalapuram: పంటల బీమా నమోదు ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష!

Amalapuram: కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ అమలాపురంలో పంటల బీమా పై సమీక్ష నిర్వహించి, వరి పంటకు ఆగస్టు 15, అరటి పంటకు జూలై 31 లోగా బీమా నమోదు చేసుకోవాలని కోరారు.

PRABHU, RAZOLE
Published on: 25 July 2026 10:35 PM IST
Amalapuram
X

Amalapuram: పంటల బీమా నమోదు ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష!

అమలాపురం: రైతులు ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం వంటి కారణాలతో పంట నష్టాలకు గురై ఆర్థిక ఇబ్బందులు పడకుండా పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అన్నారు.

శనివారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యాన, సహకార శాఖ అధికారులు, బ్యాంకర్లతో కలిసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY), వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (WBCIS) అమలుపై సమీక్ష నిర్వహించారు.ఖరీఫ్-2026 సీజన్‌లో అర్హులైన ప్రతి రైతు పంటల బీమా పథకాలలో నమోదు అయ్యేలా గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పంట రుణాలు తీసుకున్న రైతులతో పాటు రుణాలు తీసుకోని రైతులు కూడా బీమా చేయించుకోవాలని సూచించారు.

వరి పంటకు ఎకరాకు రూ.76 ప్రీమియంతో రూ.38 వేల వరకు, అరటి పంటకు రూ.3 వేల ప్రీమియంతో రూ.60 వేల వరకు బీమా రక్షణ లభిస్తుందని తెలిపారు. వరి పంట బీమా నమోదుకు ఆగస్టు 15, అరటి పంటకు జూలై 31 చివరి తేదీగా నిర్ణయించినందున రైతులు గడువులోగా నమోదు పూర్తి చేసుకోవాలని కోరారు.

బ్యాంకులు, సీఎస్‌సీ కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ ద్వారా బీమా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. గ్రామ స్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి రైతుకు పంటల బీమా ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, బ్యాంకర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story