Amalapuram: పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలి!

Amalapuram: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు.

SURESH, AMALAPURAM
Published on: 13 Nov 2026 9:34 PM IST
Amalapuram
X

Amalapuram: పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలి!

అమలాపురం: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా,పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో రిటర్నింగ్ అధికారులు (ROలు), సహాయ రిటర్నింగ్ అధికారులు (AROలు), స్టేజ్-1 అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ఎన్నికల నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 60 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.

నామినేషన్ల స్వీకరణలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి దశను అప్రమత్తంగా నిర్వహించాలని సూచించారు.అన్ని గ్రామపంచాయతీ పరిధిలో పోలీస్ బందోబస్తు, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ,నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నామినేషన్ల కేంద్రాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన తనిఖీలు నిర్వహించాలన్నారు.

తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHOలు) పరస్పర సమన్వయంతో ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని, నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో వీడియో గ్రాఫర్లు, సీసీటీవీ కెమెరాల ఏర్పాట్లు ముందుగానే చేపట్టినట్లు వెల్లడించారు.

మండల స్థాయి అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను సజావుగా,నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో అధికారులు తమకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకొని,ఎన్నికల విధులపై పూర్తి అవగాహనతో బాధ్యతలు నిర్వర్తించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు,జిల్లా పంచాయతీ అధికారి కె. శాంతికుమారి,జిల్లా పరిషత్ సీఈఓ వసంత మాధవి, రామచంద్రపురం డీఎల్‌డీఓ అబ్రహం లింకన్,అమలాపురం డీఎల్‌డీఓ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM