Amalapuram: సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్!

Amalapuram: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా శుక్రవారం అధికారులతో సమీక్షించారు.

SURESH, AMALAPURAM
Published on: 13 Nov 2026 9:54 PM IST
Amalapuram
X

Amalapuram: సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్!

అమలాపురం: జిల్లా లో జరగనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ రోజు స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తో కలిసి గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో అన్ని మండల అధికారులు తహసిల్దార్లు ఎస్ హెచ్ ఓ లు తో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్,ఓట్ల లెక్కింపు వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా మైక్రో లెవల్ ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ మేరకు జిల్లాలో సర్పంచ్ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తొలిదశలో అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీలకు, రెండో దశలో కొత్తపేట, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలోని మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మామిడికుదురు మండలంలోని పంచాయతీలను అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికన రెండు దశలుగా విభజించి ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామపంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యాత్మక నామినేషన్ కేంద్రాల వద్ద 1:6 , సాధారణ కేంద్రాల వద్ద 1:4 నిష్పత్తిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

గ్రామపంచాయతీ పోలింగ్ నిర్వహణలో 200 కంటే తక్కువ ఓట్లు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో రెండు,మూడు గంటల్లోనే పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉన్నందున,అక్కడ విధులు నిర్వహించే సిబ్బందిని వెంటనే కౌంటింగ్ కేంద్రాలకు తరలించి వినియోగించుకోవాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన రోజే మధ్యాహ్నం 2.30 లేదా 3 గంటలకల్లా ఓట్ల లెక్కింపు ప్రారంభించే అవకాశం ఉన్నందున కౌంటింగ్ కేంద్రాల్లో లైటింగ్, బారికేడింగ్, ప్రహరీ గోడలు తదితర మౌలిక సదుపాయాలను ముందుగానే పరిశీలించి సిద్ధం చేయాలని ఆదేశించారు.

గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులను (GMSKs) ఎలాంటి రిజర్వు లేకుండా పూర్తిస్థాయిలో పోలీస్ శాఖకు కేటాయించి,పోలింగ్ మరియు బందోబస్తు విధుల్లో వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ బందోబస్తు, సీసీటీవీ కెమెరాల నిరంతర నిఘా ఏర్పాట్లు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పోలీస్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

స్ట్రైకింగ్ ఫోర్సులు,రూట్ మొబైల్స్, పెట్రోలింగ్ బృందాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షించాలని ఆదేశించారు. గత ఎన్నికల్లో ఘర్షణలు చోటుచేసుకున్న గ్రామాలు, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా గ్రామాల్లోని స్థానిక నాయకులతో ముందస్తు సమావేశాలు నిర్వహించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పోలింగ్ కేంద్రాలు,కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో అనవసర వ్యక్తులు గుమిగూడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని,ఎన్నికల నియమావళి అమలులో ఎలాంటి రాజీ పడరాదని పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు. పోలింగ్ రోజుకు ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని,రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.

ఎన్నికల విధుల్లో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో సర్పంచ్ ఎన్నికలను విజయవంతంగా,ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా స్పష్టం చేశారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM