Konaseema: కోనసీమ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం!
Konaseema: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 145 సర్పంచ్, 1,167 వార్డు స్థానాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
Konaseema: కోనసీమ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం!
కోనసీమ: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. కొత్తపేట, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలోని 9 మండలాల్లో ఆదివారం జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తూ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి శనివారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లా కలెక్టర్ వివరాలను వెల్లడించారు.
145 సర్పంచ్, 1,167 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు
రెండో విడత ఎన్నికల్లో జిల్లాలో 145 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 1,167 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్, కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా 17 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలు, 695 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైనట్లు వెల్లడించారు.
సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ కోసం 2,362 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నట్లు తెలిపారు.
5,24,488 మంది ఓటర్లు
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 5,24,488 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వీరిలో 2,61,475 మంది పురుషులు, 2,63,000 మంది మహిళలు, 13 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు.
అర్హులైన ప్రతి ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట పోలీసు భద్రత
జిల్లాలో మొత్తం 758 పోలింగ్ ప్రాంతాలను గుర్తించగా, వాటిలో 62 సమస్యాత్మక, 37 అత్యంత సమస్యాత్మక, 659 సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు భద్రతను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా, జిల్లాలోని 1,936 పోలింగ్ కేంద్రాల్లో 230 అత్యంత సమస్యాత్మక, 259 సమస్యాత్మక, 1,447 సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.
5,814 మంది అధికారులతో ఎన్నికల నిర్వహణ
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు మొత్తం 5,814 మంది అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
వీరిలో 23 మంది జోనల్ అధికారులు, 53 మంది రూట్ అధికారులు, 57 మంది స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులు, 165 మంది స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులు, ఐదుగురు స్టేజ్-1 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఐదుగురు స్టేజ్-2 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 1,936 మంది ప్రిసైడింగ్ అధికారులు, 3,445 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 120 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నట్లు తెలిపారు.
ఎన్నికల విధుల్లో నియమితులైన ప్రతి అధికారి తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, పోలింగ్ ప్రారంభం నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించే ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి అధికారి బాధ్యతగా భావించి అమలు చేయాలని, నిబంధనల ఉల్లంఘనలను ఉపేక్షించరాదని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎన్నికల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తి
ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి డి. శాంతి కుమారి మాట్లాడుతూ, కొత్తపేట, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, పోలీసు భద్రతా సిబ్బంది, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, సంబంధిత అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆమె పేర్కొన్నారు.




