Amalapuram: 230 అర్జీలను స్వీకరించి అధికారులకు క్లాస్ పీకిన కోనసీమ జేసీ
Amalapuram: జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియా దేవి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ఫీడ్‌బ్యాక్ కోసం సిటిజన్ క్యూఆర్ కోడ్‌లను తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు.
Amalapuram: 230 అర్జీలను స్వీకరించి అధికారులకు క్లాస్ పీకిన కోనసీమ జేసీ
అమలాపురం: ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో సిటిజన్ క్యూఆర్ కోడ్‌లను తప్పనిసరిగా ప్రదర్శించాలని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియా దేవి అధికారులను ఆదేశించారు. ప్రజలు సేవలు పొందిన అనంతరం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను నమోదు చేయాలని ఆమె సూచించారు.
సోమవారం కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో సుమారు 230 అర్జీలను జాయింట్ కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుంచి అందే ఫీడ్‌బ్యాక్ ద్వారా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని ఆమె పేర్కొన్నారు.
ప్రజల సంతృప్తే అధికారుల పనితీరుకు గీటురాయిగా నిలుస్తుందని, సేవల నాణ్యతే సుపరిపాలనకు ప్రమాణమని జాయింట్ కలెక్టర్ అన్నారు. అర్జీల పరిష్కారంలో అధికారులు పూర్తి జవాబుదారీతనంతో వ్యవహరించాలని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని, అదే సమస్యపై పునరావృతంగా అర్జీలు రాకుండా శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా వచ్చిన అర్జీలను ప్రత్యేకంగా పరిశీలించి, అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సంతృప్తికరమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు.




