Gudapallipalem: పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: పోక్సో చట్టంపై అవగాహన!
Gudapallipalem: ప్రపంచ బాలల లైంగిక దోపిడీ నివారణ దినోత్సవం సందర్భంగా మలికిపురం మండలం గూడపల్లిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు.
Gudapallipalem: పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: పోక్సో చట్టంపై అవగాహన!
గూడపల్లిపాలెం: పిల్లలపై లైంగిక వేధింపులు, దోపిడీ, హింసను నివారించి, బాధిత బాలబాలికలకు న్యాయం, వైద్య, మానసిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రపంచ బాలల లైంగిక దోపిడీ, వేధింపుల నివారణ మరియు బాధితుల స్వస్థత దినోత్సవం సందర్భంగా మలికిపురం మండలం గూడపల్లిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా బాలికల సంరక్షణ అధికారిణి ఎ.ఎస్.ఎస్. రమాదేవి ఆదేశాల మేరకు, మండల విద్యాశాఖాధికారి ఎం. విజయశ్రీ, శ్రీ వై.వి. సత్యనారాయణ పర్యవేక్షణలో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ. రామచంద్రరావు, సమగ్ర శిక్ష జిల్లా కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సెలర్ వి.వి.వి. ప్రసాద్ పెసల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థులు పోక్సో ఆకారంలో మానవహారం ఏర్పాటు చేశారు. కౌన్సెలర్ ప్రసాద్ మాట్లాడుతూ పిల్లల వ్యక్తిగత భద్రత, మంచి స్పర్శ–చెడు స్పర్శ, అనుచిత ప్రవర్తనను గుర్తించడం, వేధింపులు ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. బాలబాలికలందరికీ సమాన రక్షణ కల్పించే పోక్సో చట్టం–2012 గురించి వివరించి, పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడటం చట్టరీత్యా నేరమని తెలిపారు. బాధిత పిల్లలను నిందించకుండా వారికి అండగా నిలవాలని సూచించారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్ ద్వారా జరిగే సైబర్ వేధింపులు, నకిలీ ఖాతాలు, ఫొటోల దుర్వినియోగం, ఆన్లైన్ బ్లాక్మెయిల్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పంచుకోకూడదని సూచించారు. సమస్యలు ఎదురైతే మౌనంగా ఉండకుండా నమ్మకమైన పెద్దలను సంప్రదించాలని, అత్యవసర సహాయం కోసం 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, 112 అత్యవసర నంబర్ వినియోగించుకోవాలని తెలిపారు.
ప్రతి చిన్నారికి భద్రత, గౌరవం, ఆత్మవిశ్వాసంతో జీవించే హక్కు ఉందని, విద్యార్థులందరూ తోటి పిల్లల పట్ల గౌరవం, బాధ్యతాయుతమైన ప్రవర్తన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. పిల్లల భద్రత కుటుంబం, పాఠశాల, సమాజం అందరి బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్. వేణుగోపాలరావు, కె. రమేష్ బాబు, హెచ్. శ్రీనివాస్, ఎన్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




