Ainavilli: నేదునూరు జెడ్పీ హైస్కూల్‌లో ఘనంగా మెగా పీటీఎం

Ainavilli: కోనసీమ జిల్లా నేదునూరు జెడ్పీ పాఠశాలలో మెగా పీటీఎంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. ప్రభుత్వ విద్యా సంస్కరణలు, LEAP ప్రాముఖ్యత వివరణ.

RAJU, P GANNAVARAM
Published on: 24 July 2026 6:06 PM IST
Ainavilli
X

Ainavilli: నేదునూరు జెడ్పీ హైస్కూల్‌లో ఘనంగా మెగా పీటీఎం

అయినవిల్లి: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం, నేదునూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయడం అత్యంత అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు పలు సంస్కరణలను అమలు చేస్తోందని తెలిపారు.

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రతిరోజూ పాఠశాలకు పంపడంతో పాటు వారి హాజరు, చదువు, హోంవర్క్, విద్యా పురోగతిని నిరంతరం పరిశీలించాలని సూచించారు. నెలకు కనీసం ఒకసారి పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో సమావేశమై పిల్లల అభ్యాస స్థాయిని తెలుసుకుని, అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

ఉపాధ్యాయులు భవిష్యత్ భారతాన్ని తీర్చిదిద్దే శిల్పులని కొనియాడిన ఎమ్మెల్యే , ప్రభుత్వం అమలు చేస్తున్న LEAP (Learning Excellence in Andhra Pradesh) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వారి పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, విలువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ప్రపంచ స్థాయిలో పోటీపడే యువతను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జిల్లా మరియు మండల విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story