Ambajipeta: గంగలకుర్రు బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు కిట్ల పంపిణీ
Ambajipeta: అంబాజీపేట మండలం గంగలకుర్రు బీసీ హాస్టల్‌లో దుప్పట్లు, ట్రాక్‌సూట్లు పంపిణీ చేసిన పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.
Ambajipeta: గంగలకుర్రు బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు కిట్ల పంపిణీ
అంబాజీపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం, గంగలకుర్రు గ్రామంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో ప్రభుత్వం అందించిన దుప్పట్లు, నైట్ ట్రాక్‌సూట్లు, జాకెట్లు, భోజనానికి అవసరమైన ప్లేట్లు, గ్లాసులను పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. హాస్టళ్ల ఆధునీకరణ, పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం, మెరుగైన మౌలిక వసతులు, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, నోట్‌బుక్స్, దుప్పట్లు, నైట్ ట్రాక్‌సూట్లు, జాకెట్లు వంటి సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు.
హాస్టల్‌కు అవసరమైన మరిన్ని సౌకర్యాలు ఏవైనా ఉంటే వాటిని కూడా త్వరలోనే కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించవద్దని సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎన్నో వివక్షలను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని గుర్తు చేశారు.
అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి కష్టపడి చదివి, తన కుటుంబానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర డైరెక్టర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




