Konaseema: హింసతో ఎన్నికలను శాసించాలనుకుంటే సహించేది లేదు

Konaseema: కోనసీమ జిల్లా స్థానిక ఎన్నికల్లో హింస, బెదిరింపులను అణచివేస్తాం. బీఎన్‌ఎస్ కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరిక.

SURESH, AMALAPURAM
Published on: 23 Oct 2026 11:01 PM IST
Konaseema
X

Konaseema: హింసతో ఎన్నికలను శాసించాలనుకుంటే సహించేది లేదు

కోనసీమ: కోనసీమ జిల్లా లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను భగ్నం చేయడానికి,అభ్యర్థులను అడ్డుకోవడానికి,హింసకు పాల్పడటానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు దృఢంగా, నిష్పాక్షికంగా అణచివేస్తారు. శాంతిభద్రతలను పరిరక్షించడం, అభ్యర్థులకు రక్షణ కల్పించడం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయడం పోలీసుల కర్తవ్యం.

హింసకు పాల్పడినా, నామినేషన్ల దాఖలును అడ్డుకున్నా,పోలీసులపై దాడి చేసినా,చట్టబద్ధమైన ఆదేశాలను ధిక్కరించినా ఏ పార్టీకి చెందినవారైనా చర్యలు తప్పవు.హోదా,పలుకుబడి, రాజకీయ అండ ఎవరికీ రక్షణ కవచం కావు.ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారిపై దాడి చేయడం, విధులను అడ్డుకోవడం ఎన్నికల నిర్వహణకే విఘాతం కలిగించడం.

ఇటువంటి చర్యలపై ప్రభుత్వ ఉద్యోగిని విధి నిర్వహణ నుంచి నిరోధించేందుకు దాడి లేదా బలప్రయోగం చేయడానికి సంబంధించిన బీఎన్‌ఎస్ సెక్షన్ 132తోపాటు వర్తించే కఠిన నిబంధనల కింద చర్యలు తీసుకుంటాం.ఎన్నికల కు సంబంధించి జరిగిన నేరాల లో ముద్దాయి లు స్వచ్ఛందంగా గాయపరచడం,ప్రమాదకర ఆయుధాలు లేదా సాధనాలతో గాయపరచడానికి సంబంధించిన బీఎన్‌ఎస్ సెక్షన్లు 115(2), 118(1); అక్రమంగా అడ్డగించడానికి సంబంధించిన సెక్షన్ 126(2); ప్రభుత్వ ఉద్యోగిపై దాడి లేదా బలప్రయోగానికి సంబంధించిన సెక్షన్ 132;

చట్టవిరుద్ధంగా గుమికూడటం, అటువంటి సమూహ సభ్యుల బాధ్యత, అల్లర్లకు సంబంధించిన సెక్షన్లు 189, 190, 191(2); ఎన్నికల్లో అనుచిత ప్రభావానికి సంబంధించిన సెక్షన్ 174; ప్రభుత్వ ఉద్యోగి చట్టబద్ధంగా జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించడానికి సంబంధించిన సెక్షన్ 223; ఆస్తి నష్టం,నేరపూరిత ప్రవేశానికి సంబంధించిన సెక్షన్లు 324, 329 తదితర నిబంధనలను ప్రస్తావించారు.ఎన్నికల నేరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 1994లోని సెక్షన్ 227, సంజ్ఞేయ నేరాలను నిరోధించేందుకు ముందస్తు అరెస్టుకు సంబంధించిన బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 170 కింద కూడా చర్యలు చేపట్టారు. కోనసీమ జిల్లా ఎస్పీ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు

రాళ్లు రువ్వినా,కర్రలతో దాడి చేసినా,వాహనాలకు నిప్పుపెట్టినా,ఇళ్లను ధ్వంసం చేసినా,సిబ్బందిపై దాడి చేసినా, నామినేషన్ పత్రాలను లాక్కున్నా లేదా చించివేసినా ఆధారాల మేరకు ప్రతి ఒక్కరినీ గుర్తించి చర్యలు తీసుకుంటాం.ఘటనాస్థలం నుంచి వెళ్లిపోయినంత మాత్రాన నేర బాధ్యత నుంచి తప్పించుకోలేరు.వీడియోలు, సీసీటీవీ దృశ్యాలు,ఫొటోల ఆధారంగా వ్యక్తిగత ప్రమేయాన్ని నిర్ధారించి, కేసులు నమోదు చేసి,చట్టప్రకారం అరెస్టులు చేస్తాం.

హింసాత్మక గుంపులను సమీకరించినవారు, నడిపించినవారు, రెచ్చగొట్టినవారు, ప్రేరేపించినవారి ప్రమేయం నిర్ధారణైతే వారిపైనా చర్యలు తప్పవు.నేరాన్ని ఇతరులతో చేయించినంత మాత్రాన ప్రేరేపించినవారు విచారణ నుంచి తప్పించుకోలేరు.హోదా, రాజకీయ పలుకుబడి దర్యాప్తును,ప్రాసిక్యూషన్‌ను అడ్డుకోలేవు.ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులను లేదా ఇతర సిబ్బందిని కొట్టినా,అడ్డుకున్నా, బెదిరించినా తక్షణ జోక్యం, చట్టప్రకారం అరెస్టు,వర్తించే నిబంధనల కింద ప్రాసిక్యూషన్ ఉంటాయి.

నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు,ఎన్నికల సమూహాల వద్ద కర్రలు,రాళ్లు, తుపాకులు లేదా ఇతర ఆయుధాలను తీసుకురావడం నిషేధం.అటువంటి ప్రయత్నాలను దృఢంగా అడ్డుకుంటాం.నిషేధాజ్ఞలు, నియంత్రణ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేస్తాం. బారికేడ్లను దాటినా,రోడ్లను దిగ్బంధించినా,చట్టబద్ధమైన ఆదేశాలను ధిక్కరించినా, అమల్లో ఉన్న ఆంక్షలకు విరుద్ధంగా నామినేషన్ కేంద్రాల వద్ద గుమికూడినా — గుంపులను చెదరగొట్టి, బాధ్యులపై కేసులు నమోదు చేస్తాం. గుంపులో ఎంతమంది ఉన్నారన్నది చట్టం అమలుకు అడ్డంకి కాదు.

ఈ ఘటనల్లో పాల్గొన్నవారితోపాటు గతంలో ఎన్నికల హింసకు పాల్పడిన చరిత్ర ఉన్నవారిపై బీఎన్‌ఎస్‌ఎస్ ప్రకారం తగిన ముందస్తు చర్యలు చేపడతాం. అవసరమైన చోట బైండోవర్ చర్యలు తీసుకుంటాం.వర్తించే నిబంధనల ప్రకారం సమర్థన ఉన్న సందర్భాల్లో హిస్టరీషీట్లు తెరుస్తాం.రాజకీయ నాయకులు, అభ్యర్థులు,నిర్వాహకులు తమ అనుచరులు చట్టబద్ధమైన పోలీసు ఆదేశాలను పాటించేలా చూడాలి.అనుచరులు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడకుండా నియంత్రించడంలో వారి ప్రవర్తనను కూడా పరిశీలిస్తాం.

చట్టపరమైన బాధ్యతను ఆధారాల మేరకు నిర్ధారిస్తాం. సున్నితమైన నామినేషన్ కేంద్రాలు,గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించాలని జిల్లాలోని మూడు సబ్ డివిజన్ల డీఎస్పీ లకు ఆదేశాలు జారీ చేశాం.ప్రతి ఉల్లంఘనపైనా సత్వర చర్యలు తీసుకోవాలి. అభ్యర్థులు,ఎన్నికల సిబ్బంది, ప్రజలు ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు అవసరమైన రక్షణ కల్పించాలి.బెదిరింపులు, అడ్డంకులు, హింసకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు వెంటనే 100 లేదా 112కు ఫోన్ చేసి,లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి తెలియజేయాలి.

ప్రశాంతమైన రాజకీయ కార్యకలాపాలకు పూర్తి పోలీసు రక్షణ ఉంటుంది. నామినేషన్ల దాఖలును అడ్డుకోవడం,అభ్యర్థులను బెదిరించడం,ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం వంటి చర్యలను కఠినంగా ఎదుర్కొంటాం.ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియ. అవి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అనుమతి పత్రం కావు.పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా పోలీసులు పాటించే సంయమనాన్ని బలహీనతగా భావించవద్దు.

హెచ్చరిక స్పష్టం చట్టవిరుద్ధ ప్రవర్తనను తక్షణమే నిలిపివేయాలి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు ఎవరికీ భయపడకుండా,ఎవరికీ పక్షపాతం చూపకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు.హింస, బెదిరింపులు,వ్యవస్థీకృత అల్లర్లతో ఎన్నికల ప్రక్రియను శాసించడానికి ఎవరినీ అనుమతించరు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM