Razole: రాజోలు బైపాస్ రోడ్డుపై బైక్ విన్యాసాలు: పోలీసుల కొరడా!

Razole: రాజోలు బైపాస్ రోడ్డుపై బైక్ రేసింగ్‌లు, విన్యాసాలు చేసే వారిపై కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ కొరడా ఝళిపించారు.

PRABHU, RAZOLE
Published on: 11 Aug 2026 6:30 PM IST
Razole
X

Razole: రాజోలు బైపాస్ రోడ్డుపై బైక్ విన్యాసాలు: పోలీసుల కొరడా!

రాజోలు: రాజోలు నియోజకవర్గ పరిధిలో ఇటీవల కాలంలో బైక్ విన్యాసాలు, మితిమీరిన వేగంతో వాహనాల నడపడం వంటి ఘటనలు పెరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కొత్తపేట డీఎస్పీ ఎస్.మురళీ మోహన్ మంగళవారం రాజోలులో తెలిపారు.

కొత్తగా ఏర్పాటైన బైపాస్ రోడ్డుపై కొందరు యువకులు బైక్ రైడింగ్ చేస్తూ ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అదేవిధంగా మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చుకుని అధిక శబ్దాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, మహిళలను వేధించడం, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాల ప్రభావంలో అతివేగంగా వాహనాలు నడపడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రాజోలు సీఐ, ఎస్సైలు ఇప్పటికే పలువురు బైక్ రైడర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారని, వారి మోటార్ సైకిళ్లను సీజ్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. పట్టుబడిన వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, పిల్లల ప్రవర్తనపై వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు.

తల్లిదండ్రులు పిల్లల ఆనందాన్ని కోరుకోవడం సహజమేనని, అయితే వారి భవిష్యత్తును, జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా వ్యవహరించవద్దని డీఎస్పీ సూచించారు. పిల్లలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు కూడా బాధ్యతగా పర్యవేక్షించాలని కోరారు.

చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కొత్తపేట డీఎస్పీ ఎస్. మురళీమోహన్ హెచ్చరించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story