Antarvedi: లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా వరణ యోగం సంకల్పం

Antarvedi: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా అర్చకులు లోకకల్యాణం, వర్షాల కోసం 'వరణ యోగం' కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 25 July 2026 8:42 PM IST
Antarvedi
X

Antarvedi: లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా వరణ యోగం సంకల్పం

అంతర్వేది: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేదిలో కొలువు ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని "వరుణ యోగం" కార్యక్రమాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ప్రారంభమయ్యే నాలుగు నెలల చాతుర్మాస్య వ్రత కాలంలో స్వామివారి నిత్య నైవేద్యాలు, అర్చనాది కైంకర్యాలు, ప్రత్యేక పూజలను ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా నిర్వహించేందుకు అర్చకులు, రుత్వికులను ఎంపిక చేస్తూ ఈ వరణ యోగం సంకల్పాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా లోకకల్యాణం కోసం, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే దేశ, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ విశేష పూజలు నిర్వహించారు.

పవిత్ర తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, సుందర అలంకరణలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి దివ్య దర్శనం కోసం కోనసీమతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తొలి ఏకాదశి పర్వదినాన నిర్వహించిన వరుణ యోగం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుని భక్తి పారవశ్యంతో నింపింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story