Mamidikuduru: 12 ఏళ్లయినా వెలగని వైనతేయ బ్రిడ్జి దీపాలు!
Mamidikuduru: కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి-బోడసకుర్రు వైనతేయ బ్రిడ్జిపై లైట్లు లేకపోవడంతో గ్రామస్తులు క్యాండిల్ రాలీతో నిరసన తెలిపారు.
Mamidikuduru: 12 ఏళ్లయినా వెలగని వైనతేయ బ్రిడ్జి దీపాలు!
Mamidikuduru: డా.బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, పాశర్లపూడి–బోడసకుర్రు గ్రామాల మధ్య వైనతేయ నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభమై 12 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ వీధి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయకపోవడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జిపై వెంటనే లైటింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాత్రి క్యాండిళ్లు వెలిగించి నిరసన చేపట్టారు.
రాత్రి వేళల్లో బ్రిడ్జిపై తీవ్ర చీకటి నెలకొనడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు తెలిపారు. లైట్లు లేకపోవడం వల్ల గతంలో అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చీకటిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు బ్రిడ్జిపై గంజాయి సేవిస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా "బ్రిడ్జిపై లైట్లు ఏర్పాటు చేయాలి", "ప్రజల భద్రతను కాపాడాలి" అంటూ నినాదాలు చేశారు. గన్నవరం బ్రిడ్జి మాదిరిగా వైనతేయ బ్రిడ్జిపై కూడా ఆధునిక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే, ఎంపీతో పాటు సంబంధిత అధికారులను గ్రామస్తులు కోరారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.




