Magatapalli: డీఎస్సీపై జగన్ ఆరోపణలు సరికాదు నామన రాంబాబు

Magatapalli: డీఎస్సీ నియామకాలపై వైఎస్ జగన్ నిరాధార ఆరోపణలు మానుకోవాలి: మగటపల్లి సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు విమర్శ.

PRABHU, RAZOLE
Published on: 30 July 2026 2:42 PM IST
Magatapalli
X

Magatapalli: డీఎస్సీపై జగన్ ఆరోపణలు సరికాదు నామన రాంబాబు

మగటపల్లి: డీఎస్సీ నియామకాల విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జగన్ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేకపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకాన్ని డీఎస్సీ ఫైల్‌పై చేసి 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక డీఎస్సీ అంశంపై అనవసర వివాదాలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలోనూ ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో జారీ చేసిన జీవో నెం.74కు సంబంధించి జగన్ ప్రభుత్వం మార్పులు చేసిందని, ప్రస్తుతం అదే జీవో ప్రకారం కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే దానిని తప్పుపడటం సరికాదన్నారు. నారా లోకేష్‌పై ఆధారరహిత విమర్శలు చేయడం, ధర్నాలకు దిగడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తోందని చెప్పారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీలు నామన నాగేశ్వరరావు, చెల్లింగి సింహాచలం, యాలింగి బాబూజీ, మాజీ ఉపసర్పంచ్ గోగి గోపాలకృష్ణ, యూనిట్ ఇన్‌చార్జ్ కుంచె శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సరెళ్ల సత్యనారాయణ, జనసేన గ్రామ శాఖ అధ్యక్షుడు చింతక్రింద శ్రీనివాస్, టీడీపీ గ్రామ శాఖ కార్యదర్శి భూపతి శ్రీనివాస్‌తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story