Malikipuram: మలికిపురం టీవీ రమణమూర్తిపై దాడిని ఖండిస్తూ నిరసన

Malikipuram: హైదరాబాద్‌లో టీవీ రమణమూర్తిపై దాడిని ఖండిస్తూ మలికిపురంలో భారీ ర్యాలీ. నిందితుడు కశ్యప్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్.

PRABHU, RAZOLE
Published on: 17 July 2026 7:57 PM IST
Malikipuram
X

Malikipuram: మలికిపురం టీవీ రమణమూర్తిపై దాడిని ఖండిస్తూ నిరసన

మలికిపురం: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండల కేంద్రంలో.., హైదరాబాద్‌లో జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయ విహారం ఎడిటర్ టి.వి. రమణమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటున్న కశ్యప్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఒక టీవీ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమం సందర్భంగా టి.వి. రమణమూర్తిపై చెప్పుతో దాడి చేసి అవమానించడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మలికిపురంలోని మదర్ థెరిసా నర్సింగ్ కాలేజీ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కశ్యప్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని, మత సామరస్యం, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, నిజాన్ని నిర్భయంగా చెప్పే వారిపై దాడులకు దిగడం హేయమైన చర్య అని అన్నారు. అయోధ్యలో జరుగుతున్న అవినీతిపై ఒక టీవీ ఛానల్‌లో జరిగిన చర్చలో రమణమూర్తి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, ఆయనను హిందూ మత వ్యతిరేకిగా చిత్రీకరించాలనే దురుద్దేశంతోనే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

హిందూ పరిరక్షణ సమితి బస్సు యాత్ర ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రమణమూర్తి అనేక దేవాలయాలను సందర్శించారని, తిరుపతిలో అన్నమయ్య విగ్రహ ఏర్పాటులో ఆయన చేసిన కృషి,సేవలను గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఎనలేని కృషి చేసిన ఆయనపై ఈ విధంగా దాడి చేసి అవమానించడం దురదృష్టకరమని, ఇది కులోన్మాద చర్యగా భావిస్తున్నామని అన్నారు.

ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన వాగ్దానాలతో రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని, దేవుళ్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి రాజకీయాలు చేయడం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. ఈ సంఘటనను దళిత సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని, కశ్యప్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గెడ్డం తులసి భాస్కర్, చింతా శ్యాంబాబు, సీహెచ్ తాతారావు, దేవ సురేష్, పి. ఆనంద్, బత్తుల మురళీకృష్ణ, చిలకపాటి శ్రీధర్, తాడి సహదేవ్, తాడి రవీంద్ర, మున్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story