Mamidikudur: హజరత్ అబ్బాస్ పంజా వద్ద మొహర్రం ఏడవ రోజు ప్రార్థనలు
Mamidikudur: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు, నగరం గ్రామాల్లో మొహర్రం సంతాప దినాల సందర్భంగా ఏడవ రోజు 'మెహందీ మజ్లీస్' నిర్వహించారు.
Mamidikudur: హజరత్ అబ్బాస్ పంజా వద్ద మొహర్రం ఏడవ రోజు ప్రార్థనలు
మామిడికుదురు: మొహర్రం మాసపు సంతాప దినాల్లో భాగంగా సోమవారం ఏడవ రోజు మామిడికుదురు మండలం మామిడికుదురు, నగరం గ్రామాలలోని హజరత్ అబ్బాస్ పంజా వద్ద అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావోద్వేగాల నడుమ మెహందీ మజ్లీస్ నిర్వహించారు. కర్బలా వీరుల అమర త్యాగాలను స్మరించుకుంటూ జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ప్రబోధకులు మహమ్మద్ కాసిం నజఫీ కర్బలా మహాసంగ్రామం వెనుక ఉన్న ధర్మస్ఫూర్తి, న్యాయం కోసం అహర్నిశలు పోరాడిన అహ్లెబైత్ మహనీయుల త్యాగాలను హృదయాన్ని కదిలించేలా వివరించారు. ముఖ్యంగా హజరత్ ఇమామ్ హసన్ (అ.స) తనయుడు షహె ఖాసిం (అ.స) అతి పిన్న వయస్సులోనే సత్యం, ధర్మం కోసం కర్బలా రణరంగంలో వీరమరణం పొందిన ఘట్టాన్ని వివరిస్తూ ఆయన చూపిన అచంచల విశ్వాసం, త్యాగనిరతిని గుర్తుచేశారు.
ప్రవచనం విన్న భక్తులు కర్బలా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఖాసిం పీరు పంజాను గ్రామ వీధుల గుండా భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. "యా హుస్సేన్" నినాదాలతో మారుమోగిన ఆ ప్రాంతంలో భక్తులు మాతం నిర్వహిస్తూ గుండెలు బాదుకుంటూ కర్బలా అమరజీవులకు ఘన నివాళులు అర్పించారు.
కర్బలా సందేశమైన త్యాగం, ధర్మం, న్యాయం, మానవతా విలువలు యుగయుగాలకూ మార్గదర్శకమని, ఆ మహనీయుల స్మరణ ప్రతి హృదయంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతుందని మత పెద్దలు పేర్కొన్నారు. భక్తి, వినయం, సంతాపం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా జరిగిన ఈ కార్యక్రమం భక్తుల హృదయాలను కదిలించింది.




