Rajahmundry: మా విద్యార్థులను రాజకీయాల్లోకి లాగొద్దు: సాయి నర్సింగ్ కళాశాల అధినేత

Rajahmundry: మెడికో ప్రియాంక మృతికి నివాళులర్పించే నెపంతో నర్సింగ్ విద్యార్థినులను పిలిపించి రాజకీయ రంగు పులమడంపై సాయి, ప్రియదర్శిని నర్సింగ్ కళాశాలల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 16 Aug 2026 11:29 PM IST
Rajahmundry
X

Rajahmundry: మా విద్యార్థులను రాజకీయాల్లోకి లాగొద్దు: సాయి నర్సింగ్ కళాశాల అధినేత

రాజమండ్రి: ఇటీవల రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న మెడికో ప్రియాంక మృతి ఘటన నేపథ్యంలో ఆమెకు నివాళులు అర్పించేందుకు తమ కళాశాల విద్యార్థినులను పంపాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, ఆయన కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా కోరినట్లు సాయి నర్సింగ్ కళాశాల అధినేత డీవీ సుబ్బారావు తెలిపారు.

ఈ మేరకు ఆయన మీడియాకు పత్రిక ప్రకటన, ఒక వీడియో విడుదల చేశారు. నివాళుల కార్యక్రమం పేరుతో విద్యార్థినులను అక్కడికి పంపిన విషయం తనకు ముందుగా తెలియదని, తనను సంప్రదించకుండానే కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థినులను పంపడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రియాంక మృతి పట్ల సానుభూతితో ఆమెకు నివాళులు అర్పించేందుకు విద్యార్థినులను పంపాలని కోరడంతోనే తమ కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారని డీవీ సుబ్బారావు తెలిపారు.

అయితే అక్కడికి వెళ్లిన అనంతరం విద్యార్థినులకు ప్లకార్డులు, క్యాండిల్స్ అందించి కార్యక్రమానికి రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు. మృతురాలికి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ముగించి ఉంటే ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదని పేర్కొన్నారు.

“మా కళాశాల రాజకీయాలకు పూర్తిగా అతీతం”

తమ విద్యాసంస్థలు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ వ్యవహరించవని డీవీ సుబ్బారావు స్పష్టం చేశారు. తాము ఒక స్వచ్ఛంద సంస్థగా, విద్యాసంస్థగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గానీ, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా గానీ తమ సంస్థ వ్యవహరించదన్నారు. అయితే ప్రిన్సిపాల్ స్థాయిలో మాజీ ఎంపీ వంటి ప్రజాప్రతినిధి కార్యాలయం నుంచి వచ్చిన విజ్ఞప్తికి గౌరవం ఇచ్చి విద్యార్థినులను పంపించి ఉండవచ్చని తెలిపారు.

విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించొద్దు

ప్రియాంక మృతి పట్ల తమకు కూడా సానుభూతి ఉందని, ఆమెకు నివాళులు అర్పించడాన్ని తాము తప్పుపట్టడం లేదని డీవీ సుబ్బారావు తెలిపారు. అయితే సానుభూతి కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చి విద్యార్థులకు ప్లకార్డులు, క్యాండిల్స్ అందించి రాజకీయ నినాదాలు లేదా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం మాత్రం సరికాదన్నారు. “మమ్మల్ని ఎవ్వరినీ రాజకీయాల్లోకి లాగవద్దు... మా విద్యార్థులకు, విద్యాసంస్థలకు రాజకీయ రంగు పులమవద్దు... మేము రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం... మా పిల్లలను కూడా రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకుంటున్నాం” అని డీవీ సుబ్బారావు విజ్ఞప్తి చేశారు.

మా విషయంలో కూడా అదే జరిగింది

ప్రియదర్శిని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రాధా కుమారి సాయి నర్సింగ్ కళాశాలకు జరిగిన మాదిరిగానే తమ కళాశాలకు జరిగిందని ప్రియదర్శిని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ ఎస్ రాధా కుమారి తెలిపారు. తమ కళాశాల విద్యార్థినులను కూడా కార్యక్రమానికి తీసుకెళ్లినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలను రాజకీయాలకు వేదికలుగా మార్చకుండా అన్ని రాజకీయ పక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరారు.

ప్రియాంక మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేయడం, నివాళులు అర్పించడం వరకు మాత్రమే కార్యక్రమాన్ని పరిమితం చేసి ఉంటే బాగుండేదని, అనవసరంగా విద్యార్థులను రాజకీయ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వల్ల విద్యాసంస్థల ప్రతిష్ఠకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు, విద్యాసంస్థలకు రాజకీయ రంగు పులమకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story