Amalapuram: అమలాపురంలో కూటమి నాయకుల మీడియా సమావేశం!
Amalapuram: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇశ్రాయేల్ విమర్శలను అమలాపురంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు తీవ్రంగా తిప్పికొట్టారు.
Amalapuram: అమలాపురంలో కూటమి నాయకుల మీడియా సమావేశం!
Amalapuram: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇశ్రాయేల్,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుల పై చేసిన నిరాధారమైన, బాధ్యతారాహిత్య విమర్శలను కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు.
అమలాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు కూటమి నాయకులు,ఎమ్మెల్సీ ఇశ్రాయేల్ విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తూ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని నాయకులు స్పష్టం చేశారు.
అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తమ శాఖల ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెస్తూ ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల ప్రజలు, న్యాయవాదులు భయాందోళనలకు గురయ్యారని గుర్తుచేశారు.ఆ చట్టాన్ని రద్దు చేసి, 'మన భూమి - మన హక్కు' కార్యక్రమం ద్వారా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎంతో పారదర్శకంగా రైతులకు అందిస్తున్నామని తెలిపారు.
ఈ కూటమి ప్రభుత్వం కేవలం "సూపర్-6" పథకాలనే కాకుండా, చేనేతలు,మత్స్యకారులతో పాటు పలు వర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తోందని పేర్కొన్నారు.పింఛన్లు సకాలంలో ప్రజల ఖాతాల్లో జమ అవుతున్నాయని,ఎమ్మెల్సీ ఇశ్రాయేల్ క్షేత్రస్థాయిలోకి వెళ్లి లబ్ధిదారులను అడిగితే ఆ విషయం అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యేపై ఇసుక దందా ఆరోపణలు చేయడంపై మండిపడుతూ, ధైర్యముంటే ఆధారాలతో బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు.గత పాలకుల అక్రమాలు నియోజకవర్గ ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని వ్యాఖ్యానించారు.
మీడియాను ఎమ్మెల్యే బెదిరించారంటూ వైఎస్సార్‌సీపీ చేస్తోన్న దుష్ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు.వీడియోలను సగం సగం చూపిస్తూ తప్పుదోవ పట్టించడం సరికాదని,ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా వచ్చి పారదర్శకంగా ప్రశ్నించవచ్చని స్పష్టం చేశారు.
అలాగే,ఉద్యోగ నియామకాలు మరియు డీఎస్సీ ప్రకటనలు కేవలం కూటమి హయాంలోనే సాధ్యపడ్డాయని, వైఎస్సార్‌సీపీ నాయకులకు ఉద్యోగ ప్రకటనలకు, కమిషన్లకు తేడా కూడా తెలియదని విమర్శించారు.కష్టపడి ఉద్యోగాలు సాధిస్తున్న నిరుద్యోగుల వైపే తమ ప్రభుత్వం నిలబడిందని అన్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాలనలో అమరావతిని నాశనం చేసి దెయ్యాల దిబ్బగా మార్చారని దుయ్యబట్టారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సహకారంతో వేల కోట్లతో రాజధాని పునర్నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, భవిష్యత్తులో హైదరాబాద్‌కు పోటీగా ప్రతి ఒక్కరూ గర్వపడేలా అమరావతి నిర్మించబడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఇశ్రాయేల్ తన హోదాను, స్థాయిని గుర్తుంచుకుని మాట్లాడాలని,భవిష్యత్తులో ఇలాంటి అసత్య వ్యాఖ్యలు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.




