Rajahmundry: నిందితులపై కఠిన చర్యలు – బాధిత కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం!
Rajahmundry: మెడికో ప్రియాంక మృతి పట్ల మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బాధితురాలి కుటుంబానికి వైద్య ఖర్చులతో పాటు రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు.
Rajahmundry: నిందితులపై కఠిన చర్యలు – బాధిత కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం!
రాజమహేంద్రవరం: సికింద్రాబాద్‌లో చికిత్స పొందుతూ రాజమహేంద్రవరానికి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడం పట్ల రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. ఈ విచారకర ఘటనను మొదటి నుండి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించిందని ఒక ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు.
నిర్లక్ష్యంతో నిండు ప్రాణాన్ని బలితీసుకున్న బాధ్యులెవరినీ విడిచిపెట్టేది లేదని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. బాధ్యులకు కఠిన శిక్ష పడేలా సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేసినట్లు తెలిపారు.
మృతురాలు ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 20 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించినట్లు వెల్లడించారు. అంతేగాక ఇప్పటివరకు ప్రియాంక చికిత్స కోసం అయిన మొత్తం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.కేసు విచారణను వేగవంతం చేసి త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు అమలు చేస్తామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తక్షణమే స్పందించి తగిన చర్యలకు ఆదేశించారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ..బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని, తగిన న్యాయం చేకూరుస్తుందని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.




