Nidadavole: కువైట్ నుండి స్వగ్రామానికి మహిళ రాక.. మంత్రి దుర్గేష్ చొరవ!
Nidadavole: కువైట్‌లో భర్త మరణవార్త విని రాలేకపోయిన నిడదవోలు మండలం మునిపల్లెకు చెందిన మహిళ చింతల నాగలక్ష్మికి మంత్రి కందుల దుర్గేష్ తక్షణ సాయం అందించి సురక్షితంగా రప్పించారు.
Nidadavole: కువైట్ నుండి స్వగ్రామానికి మహిళ రాక.. మంత్రి దుర్గేష్ చొరవ!
Nidadavole: ఒకవైపు కడవరకు తోడుంటాడనుకున్న భర్త ఇకలేరనే చేదు నిజం.. మరోవైపు వేల మైళ్ల దూరంలో విదేశీ గడ్డపై నరకయాతన.. చేతిలో చిల్లిగవ్వ లేని నిస్సహాయత.. అంతలోనే స్వదేశానికి రానీయకుండా వేధిస్తున్న యాజమాన్యం.. ఇది నిడదవోలు నియోజకవర్గం మునిపల్లె గ్రామానికి చెందిన చింతల నాగలక్ష్మీ అనుభవించిన వర్ణనాతీత వేదన. తాను ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులను వీడియో సందేశం ద్వారా మంత్రి కందుల దుర్గేష్ కు విషయం చేరవేసింది.. తన భర్త చివరి చూపు చూసుకునే అవకాశం కల్పించాలని వీడియోలో కోరింది.
అయితే ఆ స్థితిలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చూపిన మానవత్వం, అందించిన తక్షణ సాయం ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. మునిపల్లె గ్రామానికి చెందిన చింతల వెంకటేష్ అనే వ్యక్తి సోమవారం కరెంట్ షాక్‌కు గురై ఆకస్మికంగా మృతి చెందారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేయడమే కాకుండా బతుకుదెరువు కోసం కువైట్‌లో ఉంటున్న ఆయన భార్య చింతల నాగలక్ష్మికి స్థానిక జనసేన నాయకుల ద్వారా వెంటనే వర్తమానం పంపించారు. ఈ క్రమంలో భర్త మరణవార్త వినగానే చింతల నాగలక్ష్మీ మనసు తల్లడిల్లింది. తక్షణమే స్వగ్రామానికి బయలుదేరాలని భావించినప్పటికీ ఆమె చేతిలో కనీస ప్రయాణ ఖర్చులకు కూడా డబ్బులు లేవు.
దీనికితోడు అక్కడి యాజమాన్యం ఆమెను ఇండియాకు పంపేందుకు నిరాకరించడమే కాక ఫోన్‌లో మాట్లాడటానికి కూడా వీల్లేదని భయభ్రాంతులకు గురిచేసింది. అంతేకాకుండా స్వదేశానికి వెళ్లాలంటే రూ. 3 లక్షలు చెల్లించాలని కఠిన నిబంధన విధించింది. ఈ విషాదకర పరిస్థితులను బంధువుల ద్వారా తెలుసుకున్న మంత్రి దుర్గేష్ చలించిపోయారు. ఒక ఆడబిడ్డ పడుతున్న రోదనను, ఆమె అనుభవిస్తున్న ఆవేదనను చూసి మంత్రి దుర్గేష్ వెంటనే రంగంలోకి దిగారు.
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, నిడదవోలు క్యాంపు కార్యాలయ అడిషనల్ పీఎస్ కేఎస్ వి రమణ రావు, మునిపల్లె జనసేన గ్రామ అధ్యక్షులు భావన సురేశ్, జనసేన పార్టీ మండల కమిటీ సభ్యులు తురా దుర్గయ్య తో మాట్లాడి ఒమన్ లో ఉన్న ఏపీఎన్ఆర్టీ కో-ఆర్డినేటర్ నాగరాజుకి పరిస్థితిని వివరించారు. ప్రత్యేకించి అడిషనల్ పీఎస్ కేఎస్ వి రమణ రావు ప్రత్యేక చొరవ తీసుకొని మంత్రి కందుల దుర్గేష్ కు వివరాలన్నింటినీ తెలిపి బాధిత మహిళను నిడదవోలు రప్పించేందుకు సమన్వయం చేశారు.
అనంతరం మంత్రి దుర్గేష్ స్వయంగా చింతల నాగలక్ష్మీ అక్కతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు.. చింతల నాగలక్ష్మీని ఎట్టి పరిస్థితుల్లోనూ సురక్షితంగా, రూపాయి ఖర్చు లేకుండా స్వగ్రామానికి రప్పించే బాధ్యతను మంత్రి దుర్గేష్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కువైట్ అధికార యంత్రాంగంతో చర్చించి క్షణాల్లో ఆమెను విమానం ఎక్కించే ఏర్పాటు చేసి అత్యంత వేగంగా నిడదవోలుకు చేర్చారు. సొంత ఊరు చేరుకుని భర్త చివరి చూపునకు నోచుకున్న నాగలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో మంత్రి కందుల దుర్గేష్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
"దిక్కుతోచని స్థితిలో, కనీసం రావడానికి రూపాయి లేని సమయంలో మంత్రి దుర్గేష్ మా కుటుంబానికి దేవుడిలా అండగా నిలిచారు. ఎలాంటి ఖర్చు లేకుండా నన్ను నా సొంత ఊరికి రప్పించి, చివరిసారిగా నా భర్తను చూసుకునే భాగ్యం కల్పించారు" అని నాగలక్ష్మీ మాట్లాడటం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది..కష్టకాలంలో ఒక కుటుంబానికి ఆపద్బాంధవుడిగా నిలిచి, మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కందుల దుర్గేష్ దాతృత్వాన్ని, చొరవను నియోజకవర్గ ప్రజలందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తన కార్యాలయ అడిషనల్ పీఎస్ రమణ రావును ప్రత్యేకంగా అభినందించారు.




