Rajamahendravaram: యువతకు తొలి ఉద్యోగం.. ఆర్థిక భరోసాతో ఉజ్వల భవిష్యత్

Rajamahendravaram: రాజమహేంద్రవరంలో 'ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' కార్యక్రమం ఘనంగా జరిగింది.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari
Published on: 20 Jun 2026 9:11 AM IST
Rajamahendravaram
X

Rajamahendravaram: యువతకు తొలి ఉద్యోగం.. ఆర్థిక భరోసాతో ఉజ్వల భవిష్యత్

Rajamahendravaram: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ద్వారా యువతకు ఉపాధి – వికసిత్ భారత లక్ష్య సాధనకు బాటలు భారత ప్రభుత్వం కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, EPFO ప్రాంతీయ కార్యాలయం రాజమహేంద్రవరం నిర్వహించిన "ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన" లబ్ధిదారులకు ప్రోత్సాహక నిధుల పంపిణీ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం దివాన్ చెరువు వద్దనున్న SVPC కన్వెన్షన్స్ హాల్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్‌గా దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు ప్రోత్సాహక నిధులను విడుదల చేసి ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, దేశ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, తొలి ఉద్యోగం పొందిన యువతకు ప్రభుత్వం ప్రత్యక్ష ప్రోత్సాహం అందించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నదన్నారు.

ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ఉద్యోగార్థులు, పరిశ్రమలు రెండింటికీ ప్రయోజనం చేకూర్చే వినూత్న పథకమని పేర్కొన్నారు.

గత పన్నెండు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, స్టార్టప్‌లు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో చేపట్టిన సంస్కరణల ఫలితంగా దేశంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయని మంత్రి తెలిపారు. యువత నైపుణ్యాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి, 2047 నాటికి వికసిత్ భారత నిర్మాణంలో ప్రతి యువకుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయని అన్నారు. ఉపాధి కల్పనలో పరిశ్రమలు, యువత, ప్రభుత్వం సమిష్టిగా ముందుకు సాగితే వికసిత్ భారత లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గొరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్ వెంకటేశ్వర్లు కలువాయి, EPFO అధికారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, లబ్ధిదారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో 13 సంవత్సరాల నమ్మకమైన జర్నలిజం ప్రయాణం. నిఖార్సైన వార్తలు, లోతైన విశ్లేషణలతో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story