Razole: రాజోలు గ్యాస్ లీకేజీ ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ తక్షణ స్పందన!
Razole: రాజోలు సమీపంలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ తక్షణమే స్పందించారు. కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Razole: రాజోలు గ్యాస్ లీకేజీ ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ తక్షణ స్పందన!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు సమీపంలోని గెద్దాడవారి కుంత వద్ద చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తక్షణమే స్పందించారు. అమరావతిలో ఉన్న మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పరిసర గ్రామాల ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్, రెవెన్యూ యంత్రాంగంతో పాటు సంబంధిత అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సుభాష్ ఆదేశించారు. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, అధికారుల సూచనలు పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలకు, భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.




