Kothapeta: మోటార్ సైకిల్‌పై కాలువ గట్ల వెంబడి మంత్రుల పర్యటన!
Kothapeta: గోదావరి డెల్టా చివరి భూముల వరకు సాగునీరు అందించడమే లక్ష్యం. లొల్ల నుంచి పలివెల లాకుల వరకు బైక్‌పై పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే బండారు.
Kothapeta: మోటార్ సైకిల్‌పై కాలువ గట్ల వెంబడి మంత్రుల పర్యటన!
Kothapeta: కాలువ చివరి భూముల వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శుక్రవారం సెంట్రల్ డెల్టా వాటర్ మేనేజ్మెంట్ పర్యవేక్షణలో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు బొబ్బర్లంక నుంచి లొల్ల లాకుల నుండి పలివెల లాకులు వరకు ఎమ్మెల్యే బండారుతో కలిసి మోటార్ సైకిల్ పై పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.
ముందుగా లొల్ల లాకుల వద్ద ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కొత్తపేట జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, గుబ్బల శ్రీనివాసరావు తదితరులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గోదావరి డెల్టా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని వ్యాఖ్యానించారు.
అటువంటి గోదావరి డెల్టా రైతులు సైతం నేడు సాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కోవడానికి రెండు కారణాలున్నాయని ఒకటి సూపర్ ఎల్ నినో అయితే రెండవది వైసిపి ఐదేళ్ల పాలనలో సాగునీటి వ్యవస్థలో జరిగిన విధ్వంసం అన్నారు. 70 ఏళ్ల చరిత్రలో 15 వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి జూలై నెలలో రావడం ఇదే ప్రథమమని నీటిపారుదల శాఖ అధికారులు తెలుపుతున్నారన్నారు. ఎప్పుడైనా గోదావరిలో నీటి ఇబ్బందులు ఎదురైతే సీలేరు నుంచి మార్చి,ఏప్రిల్ నెలలో నీటిని తీసుకుంటామని, అయితే ఇప్పుడు సూపర్ ఎల్నినో కారణంగా జూలై నెలలోనే 5000 క్యూసెక్కుల నీరుని సీలేరు నుంచి తీసుకుని గోదావరి డెల్టాకు పంపిస్తున్నామన్నారు. గోదావరిలో నీటిమట్టాలు ఏ మాదిరిగా అడుగంటాయో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నీటి యాజమాన్యాలను నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, రైతులు సమన్వయం చేసుకోవాలని ,కాలువలు, లాకులు, షట్టర్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రతి చోటా రీడింగ్ లు ఎలా ఉన్నాయి? ఎంత ఇన్ఫ్లో, ఎంత అవుట్ ఫ్లో పంపిస్తున్నారనేది కిందిస్థాయి వరకు పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అన్నారు. సంక్షోభం వచ్చింది అంటే కాలువల వద్ద, పొలాల వద్ద, గట్ల వద్ద తిరిగే నాయకత్వమే ఉంటుందన్నారు.
అందుకనే నేడు ధవలేశ్వరం హెడ్ స్లూయిస్ దగ్గర నుంచి లొల్లలాకులు మొదలుకుని అమలాపురం,పి గన్నవరం, ముమ్మిడివరం శివారు ప్రాంతాల వరకు లాకులను, నీటిపారుదలను పరిశీలిస్తూ అధికారులకు అందరికీ సూచనలు చేస్తూ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వర్షపాతం తక్కువ ఉన్న, గోదావరిలో నీటి పరిమాణం తక్కువగా ఉన్న, నీటిని అందించడానికి పరిపూర్ణమైన కృషి చేస్తున్నామని అయినా శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారన్నారు.
ఎక్కడైనా నీరు ఓవర్ ఫ్లో అవుతుంటే అక్కడ నీటిమట్టాలను తగ్గించడం, ఎక్కడైతే నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉన్నాయో అక్కడ సత్వరంగా పనులు చేపట్టడం చెయ్యాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. తక్కువ నీటి యాజమాన్యంతో, తక్కువ కాల పరిమితితో కూడిన పంటలని పండించాలని రైతులకు సూచించారు. అవసరమైతే వంతుల వారీ విధానాన్ని సైతం నీటిపారుదల సంఘాలు, రెవిన్యూ అధికారులు, రైతులతో సమన్వయం చేసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించినట్లు తెలిపారు.
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో నీటిపారుదల శాఖ అంటే సెంటు పర్సెంటా, అరపర్సెంటా అని చెప్పేవాళ్ళు ఒకరు మంత్రిగా ఉంటే, నేను రోజుకు ప్రత్యర్ధులను ఇన్ని బూతులు తిట్టాను అని జగన్ కు చూపించే వ్యక్తి మరొకసారి మంత్రిగా ఉన్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో నీటిపారుదల శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు.రైతులు పదివేళ్ళు మట్టిలో పెడితేనే ప్రజల ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్తాయనే ఉద్దేశంతో రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నిమ్మల రామానాయుడు రాష్ట్రమంతా పర్యటిస్తూ రైతుల కోసం ఎంతగానో శ్రమిస్తున్నారని ప్రశంసించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను విశ్రాంతి తీసుకోరని మంత్రులను, ఎమ్మెల్యేలను ఎవ్వరిని విశ్రాంతి తీసుకోనివ్వకుండా ప్రజల కోసం పనిచేయిస్తారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, నిమ్మల రామానాయుడు నిత్యం శ్రామికుల్లా రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుంటే ఏదో ఆరోపణలు చేయాలి, వివాదాలు సృష్టించాలి అనే ఉద్దేశంతో వైసిపి నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసిన ఇద్దరు కూడా ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారితో చర్చకు వస్తే మరలా ఎన్నడూ వారు మీడియాకు ముఖం చూపించారన్నారు.
ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ గోదావరి డెల్టాపై గొడ్డలి పార్టీ ఐదేళ్ల నిర్లక్ష్య వైఖరి ఈనాడు రైతులకు శాపంగా మారిందని అన్నారు. రైతులకు ఏ విధంగానైనా న్యాయం చేయాలనే ధోరణితో జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు పనిచేస్తున్నారన్నారు. ఒక రైతు బిడ్డ జల వనరుల శాఖామంత్రి అయితే ఆ శాఖ పనితీరు ఎంత అద్భుతంగా ఉంటుందో నిమ్మల రామానాయుడు చేసి చూపిస్తున్నారన్నారు. ఎక్కడ రైతులకు ఇబ్బంది ఎదురైనా అక్కడకు ఆయన వెళ్లి సమస్యల పరిష్కారానికి అనునిత్యం కృషి చేస్తున్నారన్నారు.
బుడమేరు వరదలు విజయవాడను ముంచెత్తిన సమయంలో ఒక గొడుగు పట్టుకుని పెనుగాలులు వేస్తున్నా దగ్గరుండి పని చేయించిన వ్యక్తి నిమ్మల రామానాయుడని ప్రశంసించారు. ఈరోజు పట్టిసీమ వల్ల కృష్ణ డెల్టా ఊపిరి పోసుకుందన్నారు. ధవలేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులు చేపట్టడం, లొల్లలాకుల పునర్నిర్మాణానికి నిధులు కేటాయించడం వంటి చర్యలతో రాష్ట్రంలోనే జలకళ సంతరించుకునేలా కృషి చేస్తున్నారన్నారు. గోదావరి డెల్టా రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై స్వయంగా ఆయనే వచ్చి మోటార్ సైకిల్ పై పర్యటించి, పరిశీలన చేసి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను కళ్ళారా చూసి దానికి తగిన పరిష్కారాలు అన్వేషించడం ఆయన యొక్క నిబద్ధతకు నిదర్శనమన్నారు.
లొల్ల, మెర్లపాలెం రైతులకు ముంపు సమస్య ఉండగా, పంపింగ్ స్కీముల సమస్యలను సైతం పరిశీలించారన్నారు. బొబ్బర్లంక నుంచి మురమళ్ళ వరకు మోటారు సైకిల్ మీద ప్రయాణం చేసి రైతుల సమస్యలను మంత్రి తెలుసుకోవడం నిజంగా అభినందనీయమన్నారు. నీటి ఎద్దడి ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ పంటల సాగుపై సైతం రైతులు దృష్టి పెట్టాలన్నారు. గోదావరి డెల్టా ఆధునీకీకరణకు సైతం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హయాంలో తప్పకుండా ఈ బృహత్ కార్యక్రమం జరిగి తీరుతుందన్నారు.
ప్రజలు కూడా కొన్ని అంశాలు గమనించాలన్నారు. ధవలేశ్వరం బ్యారేజీ మరమ్మత్తులు కానీ, లొల్ల లాకులకు గాని 2014 - 19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాత్రమే గేట్లు పెట్టినా,గ్రీజులు పూసినా, ఏ విధమైన నిర్వహణ పనులు చేసినా అప్పుడు మాత్రమే జరిగాయన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ధవలేశ్వరం బ్యారేజీ, లొల్లలాకులకు కనీస మరమ్మత్తులు సైతం చేయలేదన్నారు. రైతులు సైతం ఇవన్నీ గుర్తించాలన్నారు. కూటమి ప్రభుత్వం రైతులపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తుందన్నారు.




