Rajahmundry: అమృత్ 2.0 పనులపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్ష!
Rajahmundry: అమృత్ 2.0 మంచినీటి పైపులైన్ పనులపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్ష. పనులు పూర్తయిన వెంటనే రోడ్లను పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశం.
Rajahmundry: అమృత్ 2.0 పనులపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్ష!
Rajahmundry: అమృత్ 2.ఓలో భాగంగా నగరంలో కొనసాగుతున్న మంచినీటి సరఫరా పైపులైన్ పనుల్లో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, పనుల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు.
ప్రస్తుతం నగరంలో జరుగుతున్న పైపులైన్, వాటర్ వర్క్స్ పనుల పురోగతి, రోడ్ల పునరుద్ధరణ, పైపులైన్ లీకేజీలు, ట్రాఫిక్ సమస్యలు తదితర అంశాలపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన కార్యాలయంలో నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అధికారులు, పబ్లిక్ హెల్త్ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీరు ప్రజలకు అత్యవసర సేవని, పైపులైన్ పనుల అనంతరం ఎక్కడైనా లీకేజీ, బ్రేక్‌డౌన్ ఏర్పడితే వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టాలన్నారు. ఒకచోట పని చేసి వదిలేయడం కాకుండా, పని పూర్తయిన వెంటనే రోడ్డు, జాయింట్లు తదితర ప్రాంతాలను కూడా సక్రమంగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. పైపులైన్ పనుల్లో చిన్న లోపం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని, ఎక్కడైనా సమస్య కనిపిస్తే వెంటనే రెక్టిఫై చేయాలని ఆదేశించారు.
ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇటీవల నగరంలో పైపులైన్ పనుల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడం, లీకేజీలు ఏర్పడటం వంటి అంశాలు తన దృష్టికి వచ్చాయని, ఇకపై ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి నాణ్యత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, పైపులైన్‌లో ఏదైనా సమస్య తలెత్తితే ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లు చేస్తూనే సమస్యను తక్షణమే పరిష్కరించాలన్నారు.
రద్దీగా ఉండే రోడ్లలో పైపులైన్ పనులు చేపట్టే సమయంలో ట్రాఫిక్ పోలీసులతో ముందుగానే సమన్వయం చేసుకోవాలని సూచించారు. అవసరమైతే కొన్ని రోజులపాటు భారీ వాహనాల రాకపోకలను నియంత్రించి, పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. పాత పైపులైన్లు ఉన్న ప్రాంతాల్లో పనులు చేపట్టే ముందు అక్కడ ఉన్న పాత లైన్లను గుర్తించి, సంబంధిత ఇంజినీరింగ్ అధికారుల సమక్షంలో పనులు నిర్వహించాలన్నారు.
కంబాలచెరువు వద్ద ఉన్న హై టెక్ బస్టాండ్ వద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి అక్టోబర్ మొదటి లేదా రెండో వారంతో పనులు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టనున్నామనన్నారు. అలాగే పుష్కరాల నేపథ్యంలో చేపడుతున్న మౌలిక వసతుల పనుల్లో వేగంతో పాటు నాణ్యతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ఇప్పటివరకు ప్రజలు అభివృద్ధి పనులకు సహకరిస్తున్నారని, అయితే పనుల్లో జాప్యం, పదేపదే రోడ్లు తవ్వడం, మరమ్మతులు ఆలస్యం కావడం వంటి అంశాలు ప్రజల్లో అసంతృప్తికి దారితీయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, పనుల పురోగతిపై వారానికొకసారి స్పష్టమైన అప్‌డేట్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు.




