Rajahmundry: విద్యార్థి దశే భవిష్యత్తుకు పునాది ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

Rajahmundry: రాజమండ్రి మేఘా కళాశాలలో 'మీ భద్రత – మా బాధ్యత' సదస్సు. విద్యార్థులు చట్టాన్ని గౌరవించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 4 July 2026 8:00 PM IST
Rajahmundry
X

Rajahmundry: విద్యార్థి దశే భవిష్యత్తుకు పునాది ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

రాజమండ్రి: స్థానిక మేఘా జూనియర్ కళాశాలలో నిర్వహించిన "మీ భద్రత – మా బాధ్యత" అవగాహన కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు చట్టాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌లో పరీక్షల్లో మార్కులు తగ్గినా బెటర్‌మెంట్ రాసుకునే అవకాశం ఉంటుందని, కానీ జీవితంలో చట్టపరంగా చేసే ఒక్క తప్పు జీవితాంతం వెంటాడుతుందని హెచ్చరించారు.

విద్యార్థి దశే జీవితాన్ని తీర్చిదిద్దే కీలక సమయమని, ఈ వయసులో తీసుకునే సరైన నిర్ణయాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చిన్న కేసు నమోదైనా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, కుటుంబానికి కూడా అవమానం కలిగే పరిస్థితి వస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్య, ఉపాధి, పెట్టుబడుల రంగాల్లో విస్తృత అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు.

ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, క్వాంటం వ్యాలీ వంటి ప్రాజెక్టులతో యువతకు రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని వివరించారు. గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, ప్రస్తుతం 18 వేల మంది ఉపాధ్యాయులను నియమించడం ద్వారా విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "మహిళా రక్షక్" వ్యవస్థ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నామని, మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సివిల్ డ్రస్‌లో ప్రత్యేక బృందాలు నిరంతరం నిఘా నిర్వహిస్తున్నాయని, తప్పు చేసిన వారిపై కౌన్సెలింగ్ నుంచి కేసుల నమోదు వరకు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

"తల్లికి, తండ్రికి చెప్పుకోలేని పని ఏదీ చేయొద్దు" అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి జీవిత సూత్రంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ తల్లిదండ్రులు గర్వపడేలా చదువులో రాణించాలని ఆకాంక్షించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం రాజీ పడదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడే వారిపై రౌడీషీట్లు, అవసరమైతే పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నామని, సామాన్య ప్రజలు భయపడకుండా జీవించే వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యార్థులు చట్టాన్ని గౌరవిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగితేనే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story