Rajahmundry: విద్యార్థినుల భద్రతకు 'మహిళా రక్షక్': ఎమ్మెల్యే!
Rajahmundry: విద్యార్థినుల రక్షణకు 'మహిళా రక్షక్' అండగా ఉంటుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Rajahmundry: విద్యార్థినుల భద్రతకు 'మహిళా రక్షక్': ఎమ్మెల్యే!
రాజమండ్రి: విద్యార్థినుల భద్రత, మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. విద్యార్థినులు తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, స్మార్ట్‌ఫోన్‌ను అనవసర విషయాలకు కాకుండా విజ్ఞానం, నైపుణ్యాల పెంపునకు ఉపయోగించుకోవాలని సూచించారు.
ప్రకాశంనగర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో నిర్వహించిన ‘మీ భద్రత – మా బాధ్యత’ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులతో మాట్లాడారు. కార్యక్రమంలో డీఎస్పీ, పోలీసు అధికారులు, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది, విజయకృష్ణ జూనియర్ కళాశాల టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ.. మహిళలు, విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకే వార్డు స్థాయి నుంచి ఈ కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. ఆకతాయిలు, బ్లేడ్ బ్యాచ్‌లు, మాదక ద్రవ్యాలకు బానిసైన యువకులు, ఇతర అసాంఘిక కార్యకలాపాల వల్ల సమస్యలు ఎదురవుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ప్రజల నుంచి అందుతున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ప్రభుత్వం, పోలీసు శాఖ పరంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రత కోసం ‘మహిళా రక్షక్’ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. విద్యార్థినులను ఎవరైనా వేధించినా, ట్రోల్ చేసినా, అనుమానాస్పదంగా వెంటపడినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్య ఎదురైన ప్రాంతం, వాహనం నంబర్ వంటి వివరాలను పోలీసులకు అందిస్తే తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
“సమస్యను మీలోనే దాచుకోకండి... పోలీసులకు సమాచారం ఇవ్వండి... వెంటనే పరిష్కారం కాకపోయినా సమస్యను వదిలేయకుండా అధికారుల దృష్టికి తీసుకురండి... మీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్".
స్మార్ట్‌ఫోన్‌ను స్మార్ట్‌గా ఉపయోగించాలి
విద్యార్థినులు సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్ తదితర సోషల్ మీడియా వేదికలను అనవసర వివాదాలకు, ఇతరులను అవమానించేలా ఉపయోగించకుండా విద్య, విజ్ఞానం, కొత్త విషయాలను నేర్చుకునేందుకు వినియోగించాలని చెప్పారు. “సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నిజాలు కావు... ఫ్యాబ్రికేటెడ్ న్యూస్, తప్పుడు సమాచారం ఎక్కువగా వస్తుంటుంది... అందుకే ఏ విషయాన్నైనా నిర్ధారించుకున్న తర్వాతే నమ్మాలి... స్మార్ట్‌ఫోన్‌ను స్మార్ట్‌గా ఉపయోగించండి” అని విద్యార్థినులకు హితవు పలికారు. విద్యార్థి దశ భవిష్యత్తుకు పునాది వేసుకునే కీలకమైన సమయమన్నారు.
చెడు స్నేహాలు, మాదక ద్రవ్యాలు, అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. పరిచయం ఉన్న వ్యక్తి ఇచ్చిన వస్తువును మరొకరికి అందించే విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని, తెలియని వస్తువులను తీసుకెళ్లడం వల్ల అనుకోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “తల్లికి చెప్పుకోలేని పనులు ఏవీ చేయవద్దు... తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు... వారి ఆశలను నిలబెట్టేలా కష్టపడి చదవండి... సమాజంలో తలెత్తుకుని నడిచేలా మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి” అని కోరారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు హక్కు వస్తుందని, అప్పటి నుంచి బాధ్యతాయుత పౌరులుగా పోలీసు శాఖను, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో విద్యార్థులు, యువత కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం నగరం విద్య, వైద్యం, ఆర్థిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు నగరానికి వస్తున్నారని తెలిపారు. జనాభా పెరుగుతున్న కొద్దీ కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని, వాటిని సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల సహకారం అవసరమని చెప్పారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదని, అవసరమైన చోట రౌడీషీట్లు తెరవడంతో పాటు చట్టంపై భయం కలిగేలా కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలి
మహిళలు, బాలికలకు విద్య అందించడంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో పెరిగిందని ఎమ్మెల్యే వాసు అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని, విద్యార్థినులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. “భవిష్యత్తులో మీరు ఎక్కడ చదువుకున్నారు..? ఎక్కడి నుంచి వచ్చారు..? అని అడిగినప్పుడు మీ విద్యాసంస్థ పేరు, రాజమహేంద్రవరం పేరు గర్వంగా చెప్పే స్థాయికి ఎదగాలి... మీ తల్లిదండ్రులు, మీ విద్యాసంస్థ, మీ నగరం గర్వపడేలా కష్టపడండి” అని విద్యార్థినులకు సూచించారు.
రాష్ట్రంలో ఐటీ, పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని, భవిష్యత్తులో యువతకు రాష్ట్రంలోనే మంచి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. విద్యార్థినులు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని కోరుతూ.. “కష్టపడి చదవండి.. బాధ్యతాయుత పౌరులుగా ఎదగండి... మీ భవిష్యత్తు విజయవంతంగా, ప్రకాశవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు.




