Rajahmundry: బత్తిననగర్‌లో సొంత నిధులతో సంక్షేమ పనులు చేపట్టిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
Rajahmundry: రాజమహేంద్రవరం బత్తిననగర్‌లో భవాని ఛారిటబుల్ ట్రస్ట్ నిధులు ₹5 లక్షలతో వాకింగ్ ట్రాక్, జిమ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
Rajahmundry: బత్తిననగర్‌లో సొంత నిధులతో సంక్షేమ పనులు చేపట్టిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమండ్రి: మాట ఇవ్వడం వేరు... ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అమలు చేయడం వేరని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.5 లక్షల భవాని ఛారిటబుల్ ట్రస్ట్ నిధులతో 1వ డివిజన్ బత్తిననగర్‌లో స్థానిక ప్రజల కోసం వాకింగ్ ట్రాక్, జిమ్ సామాగ్రి ఏర్పాటు పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బత్తిననగర్ తమ కుటుంబానికి ఎంతో సెంటిమెంట్‌తో కూడిన ప్రాంతమన్నారు. 2019లో తన సతీమణి ఆదిరెడ్డి భవాని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో ఎన్నికల ప్రచారాన్ని బత్తిననగర్ నుంచే ప్రారంభించామని, 2024లో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించామని గుర్తుచేశారు.
ప్రతిసారీ ఈ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ ఇస్తూ ఆదరిస్తున్నారని తెలిపారు. బత్తిననగర్ ప్రజలు అడిగిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం పరంగా చేయగలిగిన సహాయాన్ని చేస్తున్నామని, ప్రభుత్వ నిధులతో సాధ్యం కాని పనులను భవాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వ్యక్తిగతంగా చేపడుతున్నామని చెప్పారు. స్థానికంగా దేవాలయానికి షెడ్డు ఏర్పాటు చేశామని, మసీదుకు షెడ్డు కోసం ఇచ్చిన మాటను కూడా తప్పకుండా నిలబెట్టుకుంటామని తెలిపారు.
2వ వార్డు నారాయణపురంలో మసీదు నిర్మాణం పూర్తయిన అనంతరం, బత్తిననగర్ మసీదుకు కూడా షెడ్డు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్థానిక మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు పార్కు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారని, అందుకు సుమారు రూ.5 లక్షలు అవసరమవుతాయని తెలిపారు. 2019లో ఇచ్చిన మాట ప్రకారం భవాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సొంత నిధులతో ఈ పనులను చేపట్టామని పేర్కొన్నారు.
పార్కులో వాకింగ్ ట్రాక్‌తో పాటు జిమ్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 1వ డివిజన్లో సుమారు 200 కుటుంబాలు మూడు రేషన్ షాపులకు విభజించబడటంతో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటిని సక్రమంగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 1వ డివిజన్ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉందని, బత్తిననగర్ ప్రజలు మరింత విశ్వాసంతో పార్టీకి అండగా నిలుస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.
భవాని ఛారిటబుల్ ట్రస్ట్, సీఎస్ఆర్ నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, దేవాలయాలు, మసీదులు, చర్చిల నిర్మాణాలకు సహకరిస్తున్నామని చెప్పారు. ప్రజలు తన కుటుంబంపై ఉంచిన విశ్వాసానికి ప్రతిఫలంగా ప్రభుత్వం ద్వారా సాధ్యం కాని పనులను కూడా వ్యక్తిగతంగా చేపట్టేందుకు ఎప్పుడూ కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




