Rajahmundry: రాజకీయాలకు అతీతంగా సేవే పరమావధి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు!
Rajahmundry: రాజకీయాలకు అతీతంగా సేవ చేయడమే మదర్ థెరిసా సందేశమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి చర్చిపేటలో వృద్ధులకు దుస్తులు, భోజనం పంపిణీ చేశారు.
Rajahmundry: రాజకీయాలకు అతీతంగా సేవే పరమావధి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు!
రాజమండ్రి: సేవ చేయడమే మదర్ థెరిసా జీవిత సందేశమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఎస్సీ సెల్ టీడీపీ నగర అధ్యక్షులు చాపల చిన్నరాజు ఆధ్వర్యంలో చర్చిపేటలో జరిగిన సేవామూర్తి మదర్ థెరిసా 115వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మదర్ థెరిసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు దుస్తులు, మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ మదర్ థెరిసా చేసిన సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. సేవా కార్యక్రమాల్లో మనిషి రాజకీయాన్ని, పార్టీని చూడకూడదని పేర్కొన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమై ఉండాలని, ఎన్నికల అనంతరం ప్రజల సంక్షేమం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
2024లో జరిగిన ఎన్నికల్లో తన ఓటమి కోసం పనిచేసిన వైసీపీ నాయకులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా వారికి సహాయం అందించామని తెలిపారు. “ఎన్నికల వరకు రాజకీయాలు... ఎన్నికలు ముగిసిన తర్వాత సంక్షేమం అందరికీ” అనే ఆలోచనతోనే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలు నగర అభివృద్ధికి అడ్డంకిగా మారకూడదని, సమాజం, రాష్ట్రం, నగరం శ్రేయస్సు కోసం అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలని ఆయన అన్నారు. గతంలో జరిగిన రాజకీయాల కంటే తమ పాలనలో మంచి మార్పు కనిపించాలని, విమర్శలకు విమర్శలతో కాకుండా పనితీరుతో సమాధానం చెప్పాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
చర్చిపేటలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. అతి త్వరలోనే ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ఎటువంటి అవినీతికి తావు లేకుండా అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని చెప్పారు. నగరం శాశ్వతమని, రాజకీయ నాయకులు, పదవులు తాత్కాలికమని పేర్కొన్న ఆయన, రాజమహేంద్రవరం నగరానికి ఎటువంటి అపకీర్తి రాకుండా అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. “కుప్పం అంటే చంద్రబాబు నాయుడు, పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చినట్లే, రాజమహేంద్రవరం అంటే మనందరికీ గర్వకారణంగా నిలవాలి” అని అన్నారు.
ఎస్సీ సెల్ టీడీపీ నగర అధ్యక్షులు చాపల చిన్నరాజు మాట్లాడుతూ చర్చిపేటలో 23 సంవత్సరాలుగా మదర్ థెరిసా జయంతి వేడుకలను నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. యంగ్ స్టార్ అసోసియేషన్ ద్వారా తమ సేవా కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిరంతరం సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి, అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు సహాయం అందించడంలో ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు.
గత ఎన్నికల్లో చారిత్రాత్మక మెజారిటీతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను గెలిపించిన ప్రజలు, రానున్న రోజుల్లో మరింత భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని ఆయన కోరారు. రెండు సంవత్సరాల కూటమి పాలనలో ఎమ్మెల్యే ప్రజలకు, నగర అభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మజ్జి రాంబాబు, రెడ్డి మనేశ్వరరావు, బుడ్డిగ రవి, రామినీడి మురళీ, శేషు, రత్నం, సతీష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.




