Rajahmundry: లింగంపేటలో 25 ఏళ్ల నాటి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
Rajahmundry: రాజమండ్రి 39వ డివిజన్ లింగంపేటలో రూ.24 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన అభివృద్ధి చేస్తామన్నారు.
Rajahmundry: లింగంపేటలో 25 ఏళ్ల నాటి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
రాజమండ్రి: స్థానిక 39వ డివిజన్ లింగంపేట 2, 3వ వీధుల్లో రూ.24 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్ ఇంచార్జ్ యాళ్ల ప్రదీప్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 20 నుంచి 25 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఈ పనులు చేపట్టామని తెలిపారు.
లింగంపేటలో డ్రైనేజీ సక్రమంగా లేక వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుంగిపోయిన కల్వర్టులను పునర్నిర్మించి, మొత్తం రోడ్డు ఎత్తు పెంచడంతో పాటు ఐదు కల్వర్టులను ఎత్తు పెంచేలా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తామని చెప్పారు. ఈ పనులను రెండు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 39వ డివిజన్‌లో ఇప్పటికే రూ.2.53 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, ఇటీవల రూ.52 లక్షల పనులు ప్రారంభించామని, మొత్తంగా రూ.3 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అదనంగా రూ.1.81 కోట్ల పనులు టెండర్ దశలో ఉండగా, పుష్కరాల నిధులతో మరో రూ.4.5 కోట్ల పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
గతంలో నిర్లక్ష్యానికి గురైన డ్రైనేజీ, రోడ్ల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ నగరాన్ని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం అయితేనే నగరం పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటుందని, పుష్కరాల కోసం మంజూరైన రూ.140 కోట్లతో నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేసి ఆదర్శ రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.




