Rajahmundry: మాట ఇస్తే చేసి చూపిస్తా స్కూల్ అభివృద్ధిపై ఎమ్మెల్యే వాసు!
Rajahmundry: రాజమండ్రి మోరంపూడి మున్సిపల్ స్కూల్‌లో రూ.20 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన నూతన తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
Rajahmundry: మాట ఇస్తే చేసి చూపిస్తా స్కూల్ అభివృద్ధిపై ఎమ్మెల్యే వాసు!
Rajahmundry: తాను మాటలతో కాలాక్షేపం చేసే మనిషిని కాదని, మాట ఇస్తే ఖచ్చితంగా చేసి చూపిస్తానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రూ. 20,00,000లు సిఎసఆర్ నిధులతో చేపట్టి మోరంపూడి స్పెషల్ మున్సిపల్ పాఠశాలలో ప్రారంభించిన 9, 10వ తరగతి గదులు, రెస్ట్ రూమ్ý అందుకు నిదర్శనమన్నారు. స్థానిక మోరంపూడి సిటీ స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక ` ఉన్నత పాఠశాలలో ఏపీ పేపర్ మిల్లు సిఎసఆర్ నిధుల ద్వారా రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన 9వ, 10వ తరగతి గదులు, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, బెంచీలు, బాలికల కోసం విశ్రాంతి గది (రెస్ట్ రూమ్) తదితర అభివృద్ధి పనులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన సభలో ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల సమయంలో మోరంపూడి ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రజలు, స్థానిక నాయకులు తనను కోరిన ప్రధాన డిమాండ్ 9వ, 10వ తరగతులను ఈ పాఠశాలలో ప్రారంభించాలని కోరారని గుర్తు చేశారు. 8వ తరగతి వరకు చదివిన పిల్లలు 9వ, 10వ తరగతుల కోసం మారంపూడి దాటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం వల్ల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, పిల్లలను ప్రతిరోజూ దూర ప్రాంతాలకు పంపడం తల్లిదండ్రులకు భారంగా మారిందని వివరించారు.
ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో మాట ఇచ్చామని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో ఈ పాఠశాలలో 9వ, 10వ తరగతులకు అనుమతులు తీసుకొచ్చామని గర్వంగా తెలిపారు. దీంతో స్థానిక విద్యార్థులు తమ ప్రాంతంలోనే ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం లభించిందన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే ప్రధానోపాధ్యాయులు కొత్త సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని, 9వ, 10వ తరగతులు ప్రారంభమైనా సరిపడా తరగతి గదులు లేవని చెప్పారని వివరించారు. ప్రభుత్వ నిధులు మంజూరు కావడానికి సమయం పడుతుందని భావించి, వెంటనే సామాజిక బాధ్యతతో ముందుకొచ్చే పరిశ్రమలను సంప్రదించామని చెప్పారు.
తమ విజ్ఞప్తికి ఏపీ పేపర్ మిల్స్ యాజమాన్యం సానుకూలంగా స్పందించి తమ సిఎసఆర్ ద్వారా రూ.20 లక్షలతో తరగతి గదులు, బెంచీలు, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నందుకు సంస్థ ప్రతినిధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా బాలికల కోసం విశ్రాంతి గది ఏర్పాటు చేయాలని కోరగా, కేవలం షెడ్ కాకుండా శాశ్వత కాంక్రీట్ స్లాబ్ నిర్మించి మరింత మెరుగైన వసతి కల్పించడం ఏపీ పేపర్ మిల్స్ సేవా దృక్పథానికి నిదర్శనమని ప్రశంసించారు. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ఈ పాఠశాల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించిన ఎమ్మెల్యే వాసు “నేను మాటలు చెప్పే నాయకుడిని కాదు... మాట ఇస్తే చేసి చూపించే నాయకుడిని” అని స్పష్టం చేశారు.
ప్రజలు అడిగిన వెంటనే 9వ, 10వ తరగతుల అనుమతులు తీసుకురావడంతో పాటు, తరగతి గదులు కూడా నిర్మించి ఇచ్చామని తెలిపారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... ఇప్పుడు మీకు అన్ని వసతులు కల్పించామని, ఇక మీ బాధ్యత బాగా చదివి మంచి ఫలితాలు సాధించడమేనన్నారు. ప్రస్తుతం 10వ తరగతిలో 33 మంది విద్యార్థులు ఉన్నారని, వారంతా 500కు పైగా మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 100 డేస్ యాక్షన్ ప్లాన్ వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య సుమారు 175 ఉండగా, 2025-26 విద్యా సంవత్సరంలో అది సుమారు 280కి పెరిగిందని తెలిపారు.
ఈ పెరుగుదలకు 100 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రధాన కారణమని, ఈ సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు జీవితంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవం కలిగి ఉండాలని సూచించిన ఎమ్మెల్యే వాసు “తల్లికి చెప్పుకోలేని పని ఏదీ చేయొద్దు” అని హితవు పలికారు. చిన్న చిన్న విషయాలు పర్వాలేదుగానీ, జీవితాన్ని తప్పుదారి పట్టించే పనులు ఎన్నటికీ చేయకూడదని, ప్రతి విషయంలో తల్లిదండ్రుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కూడా వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగేలా కృషి చేయాలని కోరారు. పాఠశాల అభివృద్ధి కోసం ఒక పెద్ద చెట్టును తొలగించాల్సి వచ్చినందున, దానికి బదులుగా పిల్లలకు మంచి సందేశం ఇచ్చేలా ఫలవృక్షాన్ని నాటాలని సూచించారు. తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ... “మీ బాధలు అర్థం చేసుకుని, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు అడగడం కాదు, ఎవరు నిజంగా పని చేస్తున్నారో మీరు స్వయంగా గుర్తించాలన్నారు”. ప్రభుత్వ పథకాల విషయంలో వ్యక్తుల పేర్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా మహనీయుల పేర్లను ఉపయోగిస్తున్నామన్నారు.
గత వైకాపా పాలనలో కిట్లపై రాజకీయ నాయకుల పేర్లు ఉండేవని, ప్రస్తుతం సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యార్థులకు కిట్లు అందిస్తున్నామని చెప్పారు. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి కూడా డొక్కా సీతమ్మ పేరును పెట్టడం ద్వారా మహనీయుల సేవలను విద్యార్థులకు పరిచయం చేస్తున్నామని వివరించారు.
ప్రభుత్వం తన నాయకుల పేర్లు పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ, గొప్ప వ్యక్తుల పేర్లను ముందుకు తీసుకురావడం వెనుక ఉన్న ఆలోచనను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేపరు మిల్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బిజయ్ కుమార్ సంకృ, 10వ డివిజన్ ఇన్‌ఛార్జ్ చొప్పెర్ల వీరభద్రరావు, ప్రెసిడెంట్ పంచిట్ల శివప్రసాద్, కార్యదర్శి వాసంశెట్టి బుజ్జి, కోండ్రపు అప్పారావు, రాయి లక్ష్మణరావు, అలమండ పార్వతి, కుమారి, రమణ, కూటమి నాయకులు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.




