Rajahmundry: ఘనంగా 'ఇంటింటికీ టీడీపీ' ప్రచారం!
Rajahmundry: రాజమహేంద్రవరం నగరంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 11వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Rajahmundry: ఘనంగా 'ఇంటింటికీ టీడీపీ' ప్రచారం!
రాజమండ్రి: రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు సమగ్ర అభివృద్ధిని వేగవంతం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'ఇంటింటికీ టీడీపీ – ఇంటింటికీ సంక్షేమం' కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం నగరంలోని 11వ డివిజన్‌లో డివిజన్ ఇన్‌చార్జ్ కంటిపూడి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలపై వివరాలు తెలియజేస్తూ ప్రత్యేక కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులతో వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందన్నారు.
'సూపర్ సిక్స్' హామీల అమలుతో రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం పెరిగిందని చెప్పారు. సామాజిక భద్రతా పింఛన్లను రూ.4 వేల నుంచి వివిధ కేటగిరీల వారికి రూ.6 వేల, రూ.10 వేల, రూ.15 వేల వరకు పెంచడం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించామన్నారు. అలాగే 'తల్లికి వందనం' పథకం కింద ఇంట్లో చదువుతున్న ప్రతి విద్యార్థి కోసం తల్లికి రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, 'దీపం-2' పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు.
'స్త్రీ శక్తి' పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆటో డ్రైవర్లకు ఏటా ఆర్థిక సాయం, 'అన్నదాత సుఖీభవ' కింద రైతులకు రూ.20 వేల వరకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని వివరించారు. అదేవిధంగా పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునరుద్ధరించి విస్తరిస్తున్నామని, రైతుల హక్కులను కాపాడే ఉద్దేశంతో వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనన్నారు. రాజమహేంద్రవరం నగర అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, పార్కులు, క్రీడా మౌలిక వసతులు, విద్యా మరియు వైద్య రంగాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రజల ఆశీస్సులు, సహకారంతో నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో విధ్వంసం, అప్పులు, అభివృద్ధి నిర్లక్ష్యం మాత్రమే కనిపించాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శక పాలన అందిస్తోందన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం చేసిన మేలు తెలియజేయడమే 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ప్రముఖ విద్యావేత్త నన్న సురేష్ మృతి పట్ల సంతాపం
తిరుమల విద్యాసంస్థల అధినేత నన్న తిరుమలరావు సోదరుడు, తిరుమల విద్యాసంస్థల భాగస్వామి, ప్రముఖ విద్యావేత్త నన్న సురేష్ ఆకస్మిక మృతి పట్ల ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తిలక్ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నన్న సురేష్ కి నివాళులర్పించారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల మౌనం పాటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జ్ కంటిపూడి రాజేంద్రప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




