Rajahmundry: రాజమండ్రిలో ₹140 కోట్లతో డ్రైనేజీ పనులు: MLA ఆదిరెడ్డి!

Rajahmundry: రాజమండ్రిలో రూ.140 కోట్లతో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 22 July 2026 2:40 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రిలో ₹140 కోట్లతో డ్రైనేజీ పనులు: MLA ఆదిరెడ్డి!

నగరంలో డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళనకు రూ.140 కోట్లతో ప్రణాళిక

- ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

- 9వ డివిజన్‌లో 22.75 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం

- సదరు డివిజన్‌లో ఇప్పటికే రూ.14 కోట్ల అభివృద్ధి పనులు

రాజమండ్రి:

రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరవ్యాప్తంగా రూ.140 కోట్లతో కొత్త డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి, శిథిలావస్థలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే కార్యక్రమానికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు.

నగరంలోని 9వ డివిజన్ మహాలక్ష్మీ ఆలయం సమీపంలోని విద్యుత్ కాలనీ 7వ వీధిలో రూ.22.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) శంఖుస్థాపన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గత 15 నుంచి 20 సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఈ సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందన్నారు. ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరంతరం వినతులు అందజేస్తూనే ఉన్నారని తెలిపారు.

అయితే అమృత్ పథకం కింద చేపట్టిన ప్రధాన డ్రైనేజీ పనుల కారణంగా ఈ రోడ్డు నిర్మాణం ఆలస్యమైందని, ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగడంతో కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ ద్వారా రూ.22.75 లక్షలతో పనులను అధికారికంగా ప్రారంభించామని చెప్పారు.

ఈ పనుల్లో భాగంగా సుమారు 220 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు అవసరమైన చోట డ్రైనేజీ లిఫ్టింగ్ పనులు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 9వ డివిజన్‌లోనే రెండు సంవత్సరాల వ్యవధిలో రూ.14 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టడం గర్వకారణమని చెప్పారు.

ఈ డివిజన్‌లో నివసించే ప్రజలందరూ బాధ్యతాయుతమైన పన్ను చెల్లింపుదారులని, వారు వివిధ రూపాల్లో చెల్లించే పన్నుల ద్వారానే కార్పొరేషన్‌కు ఆదాయం వస్తోందని, అలాంటి ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రజాప్రతినిధుల కనీస బాధ్యత అని స్పష్టం చేశారు.

ఇప్పటికే రూ.14 కోట్ల పనులు పూర్తిచేసినా, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని తెలిపారు. ముఖ్యంగా నగరాన్ని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాలంటే సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ అత్యంత కీలకమన్నారు. డ్రైనేజీ కనెక్టివిటీ సక్రమంగా ఉంటేనే ప్రజారోగ్యం మెరుగుపడటంతో పాటు నిర్మించిన రోడ్ల ఆయుష్షు కూడా పెరుగుతుందని వివరించారు.

డ్రైనేజీ లేకపోతే వర్షపు నీరు రోడ్లపై నిలిచి, పదేళ్లు మన్నాల్సిన రోడ్లు ఐదేళ్లకే దెబ్బతింటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలకు భవిష్యత్తులో ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ అదే అభివృద్ధి కార్యక్రమం చేపడతామని, ప్రజల నుంచి వచ్చే వినతులను పరిశీలించి అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు.

రిషితా గ్రాండ్, డెల్టా ఆసుపత్రి వెనుక ప్రాంతంలోని అధ్వాన్న రహదారుల సమస్యను కూడా కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడి రెండు ప్రధాన రోడ్లకు సుమారు రూ.2 కోట్ల వ్యయంతో డ్రైనేజీ, రోడ్డు పనులు పూర్తి చేశామని, ఇంకా మిగిలిన ప్రధాన పనులను ఎన్‌క్యాప్ నిధుల ద్వారా రూ.80 లక్షల వ్యయంతో ఈ నెల 25వ తేదీన ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

నగరంలో ప్రతి రోడ్డు, ప్రతి డ్రైనేజీని దశలవారీగా అభివృద్ధి చేస్తూ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

డివిజన్ ఇన్‌ఛార్జ్ కోసూరి చండీప్రియ సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొల్లి బుజ్జి, మరుకుర్తి శివ యాదవ్, ముసిని బాబూరావు, విశ్వనాధరాజు, స్థానిక పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story