Rajahmundry: ప్రజల గడపకు ప్రజాప్రతినిధి.. రాజమండ్రి ఎమ్మెల్యే వినూత్న పర్యటన!

Rajahmundry: రాజమండ్రి సిటీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వినూత్న కార్యక్రమం.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 13 Jun 2026 1:05 PM IST
Rajahmundry
X

Rajahmundry: ప్రజల గడపకు ప్రజాప్రతినిధి.. రాజమండ్రి ఎమ్మెల్యే వినూత్న పర్యటన!

రాజమండ్రి: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి వేగవంతమైన పరిష్కారాలు చూపించాలనే లక్ష్యంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం "మన వార్డులో – మన ఆదిరెడ్డి" విజయవంతంగా కొనసాగుతోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా 1వ మరియు 2వ డివిజన్లలో ప్రజల మధ్య రాత్రి బస చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, శనివారం ఉదయం నుంచే కూటమి నాయకులు, నగర పాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రతి వీధిలో నడుస్తూ, ప్రతి ఇంటి గడపకు వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల అమలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ స్థలాలు, ఆరోగ్య సేవలు వంటి అంశాలపై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలతో ప్రత్యేకంగా మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. పర్యటన సందర్భంగా ప్రజలు ప్రస్తావించిన సమస్యలను అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే వాసు పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.

తక్షణ పరిష్కారం సాధ్యమైన అంశాలపై వెంటనే స్పందించి చర్యలు ప్రారంభించగా, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ "ప్రజలే నా బలం... ఎన్నికల సమయంలో మాత్రమే కాదు ప్రతి రోజూ ప్రజల మధ్య ఉండటం తన బాధ్యతన్నారు. సమస్యలు కార్యాలయాలకు వచ్చి చెప్పే పరిస్థితి కాకుండా, ప్రజల వద్దకే వెళ్లి తెలుసుకోవడం ద్వారా వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు.

అందుకే 'మన వార్డులో – మన ఆదిరెడ్డి' కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలు చెప్పే ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే వరకు నిరంతరం కృషి చేస్తాం" అని అన్నారు. కాగా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రజా ప్రతినిధి స్వయంగా వార్డుల్లో రాత్రి బస చేసి, మరుసటి రోజు ఉదయం ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకోవడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తమ మధ్య ఉండి సమస్యలను వింటున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story