Rajahmundry: రూ.53 కోట్లతో భారీ మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్!
Rajahmundry: రూ.53 కోట్లతో భారీ మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం. శరవేగంగా సాగుతున్న ఆరీనా-2 పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
Rajahmundry: రూ.53 కోట్లతో భారీ మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్!
Rajahmundry: ఎన్నికల సమయంలో రాజమహేంద్రవరాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దుతానని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మొత్తం రూ.53 కోట్లతో మూడు దశల్లో మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం విఎల్ పురం పాత లారీ స్టాండ్ వద్ద కేలో ఇండియా నిధులతో నిర్మిస్తున్న మల్టీ పర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ (ఆరీనా-2) పనులు అనుకున్న టైమ్‌లైన్ కంటే వేగంగా సాగుతున్నాయని చెప్పారు. డిసెంబర్ నాటికి 80 శాతం పనులు పూర్తి చేసి, వచ్చే ఫిబ్రవరిలో ఆరీనా-2ను ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు.
విఎల్ పురం పాత లారీ స్టాండ్ వద్ద నిర్మాణంలో ఉన్న మల్టీ పర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ (ఆరీనా-2) నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్‌తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి, అనంతరం మీడియాతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేలో ఇండియా నిధుల ద్వారా ఆరీనా-2 నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. తాను, అధికారులు ఎప్పటికప్పుడు పనులను సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం పనుల పురోగతి సంతృప్తికరంగా ఉందన్నారు.
తాము నిర్ణయించుకున్న టైమ్‌లైన్ కంటే కూడా వేగంగా పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. సమీక్ష సందర్భంగా కాంట్రాక్టర్ డిసెంబర్ నాటికి 80 శాతం పనులు పూర్తయ్యే అవకాశం ఉందని, ఫిబ్రవరి నాటికి ఆరీనా-2ను ప్రారంభించవచ్చని చెప్పడం శుభవార్తగా అభివర్ణించారు.
ఈ ప్రాజెక్టు సాకారంలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కీలక సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆమె సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి కేలో ఇండియా నిధులు తీసుకువచ్చి పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఆరీనా-2తో పాటు మరో రెండు దశల్లో కూడా పనులను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
రూ.28 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించనున్న ఆరీనా-1 ప్రస్తుతం టెండర్ దశలో ఉందన్నారు. బహుశా సెప్టెంబర్ చివరి నాటికి టెండర్లు ఓపెన్ అయ్యి కాంట్రాక్టర్‌ను కేటాయించే అవకాశం ఉందని తెలిపారు. ఆరీనా-2తో పాటు ఆరీనా-1 పనులను సమాంతరంగా చేపడితే 8 నుంచి 9 నెలల్లో పూర్తి చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.
అలాగే మూడో దశలో ఆరీనా-3 నిర్మాణానికి కేలో ఇండియా ద్వారా రూ.10 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం వద్ద మంజూరు దశలో ఉన్నాయని తెలిపారు. ఈ నిధుల మంజూరు కోసం ఎంపీ పురందేశ్వరి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
కేలో ఇండియా నుంచి ఆరీనా-3కు నిధులు మంజూరైతే మూడు దశలను కలిపి మొత్తం రూ.53 కోట్లతో నగరంలో భారీ మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను పూర్తి చేయనున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో ఇది అతి పెద్దదిగా నిలిచే అవకాశం ఉందని, ఇంత భారీ స్థాయిలో మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాజమహేంద్రవరంలో నిర్మాణం కావడం నగర ప్రజలందరికీ గర్వకారణమన్నారు.
ఒక శాసనసభ్యుడిగా తాను ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటుండగా, పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపీ పురందేశ్వరి అందిస్తున్న సహకారంతో నగర ప్రజల చిరకాల కలను సాకారం చేస్తున్నామని చెప్పారు.
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని తెలిపారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకూడదని కాంట్రాక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.
పనులు వేగంగా సాగుతున్నప్పటికీ నాణ్యత విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండకూడదని సూచించామని చెప్పారు. అనుకున్న గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌ను కోరామని, అధికారులు కూడా నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు.
ఈ ప్రాజెక్టు తమకు అత్యంత ప్రాధాన్యత కలిగినదని స్పష్టం చేశారు. ఆరీనా-1 టెండర్లు కూడా అతి త్వరలో ఓపెన్ కానున్నాయని, అనంతరం అధికారికంగా నిర్మాణ పనులు ప్రారంభిస్తామని నగర ప్రజలకు మరో శుభవార్త అందించారు.
ఆరీనా-1, ఆరీనా-2, ఆరీనా-3 మూడు దశలు పూర్తి అయితే రూ.53 కోట్లతో నిర్మితమయ్యే ఈ మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాజమహేంద్రవరం నగరంతో పాటు ఈ ప్రాంతం రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుందని అన్నారు.
స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు సమీపంలో మంచి స్థాయి హోటల్ నిర్మాణం చేపట్టే ఆలోచన కూడా ఉందని ఎమ్మెల్యే వాసు వెల్లడించారు. ఈ మేరకు ప్రముఖ, పేరున్న సంస్థలు, రిప్యూటెడ్ ఆర్గనైజేషన్లతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
హోటల్ కూడా అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం కేవలం క్రీడా కేంద్రంగానే కాకుండా రెవెన్యూ జనరేటింగ్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాజమహేంద్రవరం కోసం మాత్రమే కాకుండా రాష్ట్ర, దక్షిణ భారతదేశ స్థాయి ప్రధాన క్రీడా, ఇతర భారీ కార్యక్రమాలకు కూడా ఈ కాంప్లెక్స్ వేదికగా మారేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో జరిగే మేజర్ మీట్స్‌కు రాజమహేంద్రవరం ఒక ప్రధాన వేదికగా మారే అవకాశం ఉంటుందన్నారు. విశాలమైన విస్తీర్ణంలో అనేక రకాల మల్టీ పర్పస్ ఈవెంట్లు నిర్వహించే అవకాశం కల్పించాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు.
ఇలాంటి భారీ కార్యక్రమాలు నగరంలో నిర్వహిస్తే బయటి ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు, ప్రతినిధులు, సందర్శకుల రాకతో నగరంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. హోటళ్లు, హాస్పిటాలిటీ, ఇతర రంగాల ద్వారా రెవెన్యూ జనరేషన్ జరుగుతుందని తెలిపారు. నగరానికి గుర్తింపు, ఆదాయం తీసుకురావాలన్న దూరదృష్టితోనే ఈ ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది..?
కాగా గత ప్రభుత్వం ఈ అభివృద్ధి పనులను ఎందుకు చేయలేకపోయింది అని విలేకరులు అడిగిన ప్రశ్నపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. చిత్తశుద్ధి, నిబద్ధత లేని వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని వ్యాఖ్యానించారు.
ఇటీవల నగరంలో డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయినులను కలిసిన సందర్భంగా వారు చెప్పిన మాటలు తనను కలచివేశాయన్నారు. ఒక మహిళ సిజేరియన్ ఆపరేషన్ జరిగిన రెండు నెలల్లోనే కష్టపడి పరీక్షకు హాజరై ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారని, మరో మహిళ తన తండ్రి మరణించిన మూడు నెలలకే ఉద్యోగం సాధించారని తెలిపారు.
వ్యక్తిగతంగా ఎన్నో బాధలను దిగమింగుకుని, తీవ్రంగా శ్రమించి ఉద్యోగాలు సాధించిన వారిని వైఎస్సార్సీపీ నాయకులు దొడ్డిదారిన ఉద్యోగాలు సాధించారని అనడం బాధాకరమని ఆ ఉపాధ్యాయులు తనతో ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల బాధ కలుగుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారన్నారు.




