Rajahmundry: పుష్కరాల కోసం రాజమండ్రి సిద్ధం: రూ. 11 కోట్లతో ఆలయాల అభివృద్ధి!
Rajahmundry: రాజమహేంద్రవరం అభివృద్ధిపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) కీలక వ్యాఖ్యలు. పుష్కరాల కోసం రూ. 11.46 కోట్లు మంజూరు.
Rajahmundry: పుష్కరాల కోసం రాజమండ్రి సిద్ధం: రూ. 11 కోట్లతో ఆలయాల అభివృద్ధి!
రాజమండ్రి: రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక వైభవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) స్పష్టం చేశారు. అందునా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మరింతగా ఆధ్యాత్మిక శోభ తీసుకు వస్తున్నట్లు ఆయన చెప్పరు. ఇప్పటికే ఎండోమెంట్స్ శాఖ ద్వారా ₹9.10 కోట్లతో మొదటి విడత పనులు ప్రారంభమయ్యాయని, తాజాగా మరో ₹2.36 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.
దీంతో మొత్తం రూ 11.46 కోట్లతో దేవాలయాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. తిలక్ రోడ్డులోని రెడ్డీస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి నాయకులు, ఎండోమెంట్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ఉమా మార్కండేయ స్వామి ఆలయం, ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, గౌతమి గోరక్షణ సంఘం, గౌతమి జీవకారుణ్య సంఘం, శ్యామలాంబ అమ్మవారి ఆలయం, మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సహా అనేక దేవాలయాలకు నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే వాసు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం దేవాలయాలను నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్సించారు. పుష్కరాల పనులు వేగంగా కొనసాగుతున్నాయని, విద్యుత్ అండర్ గ్రౌండ్ కేబులింగ్, అమృత్ 2.0 ద్వారా తాగునీటి ప్రాజెక్టులు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు వంటి పనులు చేపడుతున్నామని చెప్పారు. క్వారీ ప్రాంతానికి 95 కోట్ల రూపాయలతో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఎమ్మెల్యే వాసు తిప్పికొడుతూ, వాళ్ళు రీల్ స్టార్స్ రియల్ స్టార్స్ అన్నారు.
గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని వైసిపి వాళ్ళు ఇప్పుడు డీఎస్సీపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిందని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నపుడు ఏ పనీ చేయకుండా ఇప్పుడు పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమని, అసలు విమర్శించే నైతిక హక్కు లేదని వాసు అన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని తక్షణ పరిష్కారం చూపడమే "మన వార్డులో – మన ఆదిరెడ్డి" కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేసారు.
ప్రజా దర్బార్, పీజీఆర్ఎస్, ప్రజాప్రతినిధుల అందుబాటు ద్వారా ఇప్పటికే ప్రజలకు చేరువగా ఉన్నామని, అయితే కార్యకర్తలు, అధికారులు, ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యకర్త ఇంట్లో బస చేసి, ప్రజలతో మమేకమవడం ద్వారా వారి సమస్యలు, యువత ఆలోచనా విధానం మరింత స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
నిజంగా ఈ కార్యక్రమం ఓ చరిత్ర సృష్టించబోతోందని ఆయన చెప్పారు. వెన్నుపోటుకి రెండుళ్లు కార్యక్రమం ఎందుకని ఎమ్మెల్యే వాసు ఎద్దేవా చేసారు. అధికారంలో ఉన్నపుడు ఏమీ చేయనివాళ్ళు ఇలా చేయడం శోచనీయమన్నారు. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. రాజమహేంద్రవరం నగరంలో రివర్ ఫ్రంట్, మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అఖండ గోదావరి ప్రాజెక్టులు, సీఎంఆర్‌ఎఫ్ నిధులు, విమాన శిక్షణా సంస్థల వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వాసు వివరించారు.
వైసిపి విమర్శలకు ప్రజలే సమాధానం చెబుతారని ఆయన అన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆటో డ్రైవర్ చేసిన చిన్నారుల భిక్షాటన అంశంపై ఎమ్మెల్యే వాసు స్పందిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. పిల్లలతో భిక్షాటన చేయించడం క్షమించరాని నేరమని, అవసరమైతే వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
చైల్డ్ ట్రాఫికింగ్ కోణంలో కూడా విచారణ కొనసాగుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తోందని, ప్రజల ఆశీర్వాదంతో మరింత అభివృద్ధి సాధిస్తామని, కూటమి వచ్చే 15ఏళ్ళు అధికారంలో కొనసాగడం ఖాయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఏపీ శెట్టిబలిజ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, కూటమి నాయకులు మజ్జి రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, వై శ్రీను, దొండపాటి సత్యంబాబు, యిన్నమూరి దీపు, ఉప్పులూరి జానకి రామయ్య, బుడ్డిగ రవి, అడబాల రామకృష్ణ, వివిధ దేవాలయాల చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.




