Rajahmundry: పాఠశాల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్
Rajahmundry: రాజమండ్రి మెరకవీధి మున్సిపల్ పాఠశాలలో రూ.20 లక్షల సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
Rajahmundry: పాఠశాల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్
Rajahmundry: విద్యాసంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి, విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 24వ డివిజన్ మెరకలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఏపీ పేపర్ మిల్లు సీఎస్‌ఆర్ నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన తరగతి గదుల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులను బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది క్రితం పాఠశాల వెనుక గోడ శిథిలావస్థకు చేరడంతో పాటు తరగతి గదుల స్లాబుల నుంచి పెచ్చులు ఊడిపడటం, వాటర్ లీకేజీలు, కిటికీలు, తలుపులు దెబ్బతినడం, గ్రిల్స్‌కు తుప్పు పట్టడం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. స్థానిక వార్డు ఇన్‌చార్జి కాశీ సూచనతో పాఠశాల సమస్యలను పరిశీలించి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
పాఠశాలలో అప్పట్లో కేవలం 16 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 36కు పెరిగిందని చెప్పారు. విద్యార్థుల సంఖ్య మరింత పెంచేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. పాఠశాలలోని సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల సీఎస్‌ఆర్ నిధులు అందించిన ఏపీ పేపర్ మిల్లు యాజమాన్యానికి ఎమ్మెల్యే వాసు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో తాను, అధికారులు, స్థానికులు గుర్తించిన సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు అవసరమైన అదనపు పనులను కూడా చేపట్టామని చెప్పారు.
పాఠశాల ఆవరణలో శానిటేషన్ సిబ్బంది మస్టర్ రూమ్ కోసం ఉపయోగించాలనుకున్న ప్రాంతాన్ని విద్యార్థుల అవసరాలకు వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అక్కడ వంటశాల, విద్యార్థులు భోజనం చేసేందుకు షెడ్డు, ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని చర్చిస్తున్న సమయంలో గ్లాస్ వరల్డ్ అధినేత కమల్ ముందుకు వచ్చి తన సొంత నిధులతో గది, షెడ్డు, ప్లాట్‌ఫామ్ నిర్మించారని చెప్పారు. ఇందుకు కమల్ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. గత ఐదారు సంవత్సరాలుగా పాఠశాలలో ఉన్న సమస్యలకు గత ప్రభుత్వం ఎందుకు పరిష్కారం చూపలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు.
విద్యాసంస్థల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకురావడంలో కూటమి ప్రభుత్వానికి, గత వైసీపీ ప్రభుత్వానికి స్పష్టమైన తేడా ఉందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా విద్యాసంస్థల అభివృద్ధికి సహకరించాలని అందరినీ కోరుతున్నామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంతోషంగా ఉండటం, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ‘నాడు-నేడు’ పేరుతో పాఠశాలలను ఆధునీకరించామని ప్రచారం చేసిందని, అయితే వాస్తవ పరిస్థితుల్లో పెచ్చులు ఊడిపోతున్న గోడలకు సున్నాలు వేయడం మినహా మౌలిక వసతుల అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని చెప్పినప్పటికీ పాఠశాలల్లో సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 16 నుంచి 36కు పెరగడం అభినందనీయమన్నారు. పాఠశాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు అందించిన ఏపీ పేపర్ మిల్లు యాజమాన్యానికి, స్వచ్ఛందంగా సహకరించిన గ్లాస్ వర్డ్స్ అధినేత కమల్, ఆయన కుటుంబ సభ్యులకు కూటమి నాయకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.




