Rajahmundry: రాజమండ్రి మెడికల్ కాలేజీలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
Rajahmundry: రాజమండ్రి మెడికల్ కాలేజీ పనులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు కఠిన ఆదేశాలు.
Rajahmundry: రాజమండ్రి మెడికల్ కాలేజీలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
రాజమండ్రి: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే స్పందించిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సంబంధిత అధికారులు, నిర్మాణాలు మరియు నిర్వహణ పనులు చేపడుతున్న మెగా కంపెనీ ప్రతినిధులతో సమావేశమై జరుగుతున్న పనుల పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు.
నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న ఎమ్మెల్యే వాసు ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని మెగా కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ముఖ్యంగా కొత్త భవనానికి అప్రోచ్ రోడ్డు, ప్రవేశ మార్గాలు, లెక్చర్ గ్యాలరీలు, ఎలక్ట్రికల్ పనులు, పైపింగ్, ఆడియో-వీడియో టెస్టింగ్ వంటి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
కొత్తగా అడ్మిషన్లు పొందే విద్యార్థులకు తరగతుల నిర్వహణలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఇప్పటికే ఉన్న బ్లాకులను తాత్కాలికంగా వినియోగించుకోవాలని, నిర్మాణ ప్రాంతాల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నిర్మాణ సామగ్రి కారణంగా ఎక్కడా ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మెగా కంపెనీ ప్రతినిధులకు స్పష్టం చేశారు.
జూలై 25 నాటికి కొత్త లెక్చర్ గ్యాలరీలను విద్యార్థుల వినియోగానికి సిద్ధం చేయాలని, అధికారిక ప్రారంభోత్సవం కోసం ఎదురు చూడకుండా విద్యార్థులకు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థుల్లో విశ్వాసం పెంచేలా ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై ప్రత్యేకంగా సమీక్షించిన ఎమ్మెల్యే వాసు ఆగస్టు 15 నాటికి పరీక్షా హాళ్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఆదేశించారు.
జనరేటర్, ఇంటర్నెట్, సీసీ కెమెరాలు, పవర్ బ్యాకప్, ప్రింటింగ్ వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. టాయిలెట్ సౌకర్యం లేని భవనాలను పరీక్షా హాళ్లుగా వినియోగించడం సరికాదని, అవసరమైతే వాటిని ల్యాబ్‌లుగా మార్చి, పరీక్షల కోసం అన్ని ప్రమాణాలు ఉన్న హాళ్లనే ఉపయోగించాలని సూచించారు. హాస్టళ్ల నిర్మాణ పురోగతిపైనా ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. కొత్త హాస్టల్ భవనాల్లో కనీసం రెండు అంతస్తులను ఆగస్టు నాటికి విద్యార్థుల వినియోగానికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తాత్కాలిక భవనాల్లో వసతి కల్పిస్తూ, మిగిలిన విద్యార్థులకు శాశ్వత భవనాల్లో సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. బాలురు, బాలికల హాస్టళ్లకు అవసరమైన ఓవర్‌హెడ్ ట్యాంకులు, ఇతర మౌలిక వసతుల పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
విద్యార్థుల చదువులు, పరీక్షలు, వసతి, భద్రతకు సంబంధించిన ఏ అంశంలోనూ రాజీ ఉండదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. నిర్ణయించిన గడువుల్లో అన్ని పనులు పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని మెగా కంపెనీ ప్రతినిధులు, సంబంధిత అధికారులకు ఆదేశించారు. పనుల పురోగతిని తాను నిరంతరం పర్యవేక్షిస్తానని, అవసరమైతే మళ్లీ స్వయంగా తనిఖీ నిర్వహిస్తానని తెలిపారు.




