Jonnada: రాజముద్ర క్యూఆర్ కోడ్‌తో సరికొత్త పాసుపుస్తకాలు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
Jonnada: జొన్నాడలో 1628 మంది రైతులకు ఉచితంగా పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. క్యూఆర్ కోడ్, జీపీఎస్ టెక్నాలజీతో రూపకల్పన.
Jonnada: రాజముద్ర క్యూఆర్ కోడ్‌తో సరికొత్త పాసుపుస్తకాలు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
జొన్నాడ: కూటమి ప్రభుత్వంలో రాజముద్రతో కూడిన, తప్పులు లేని పాసు పుస్తకాలు రైతులకు అందజేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. జొన్నాడలో జరిగిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ లకు గానీ, లోన్లకు గానీ పట్టాదారు పాసుపుస్తకాలు రైతాంగానికి కీలకమైనవన్నారు.
వైసీపీ హయంలో రైతులు అనేక ఇక్కట్లకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.ధాన్యం కొనుగోళ్ల అంశంలో, ఎరువుల విషయంలో అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. అప్పట్లో రకరకాల తప్పులతో, జగన్ తన సొంత ఫోటోలతో పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అవి ఎందుకు పనికి వచ్చేవి కాదన్నారు.
ఎన్డీఏ కూటమి ఈ అంశాన్ని గమనించి,రైతుల ఆందోళనను అర్థం చేసుకొని పాత వాటిని రద్దు చేసి రాజమద్ర తో కూడిన పాస్ పుస్తకాలను అందిస్తుందన్నారు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన, తమ సొంత కష్టార్జితంతో కొనుగోలు చేసుకున్న ఆస్తులపై సొంతదారులకు మాత్రమే హక్కు ఉంటుందనే విధంగా పట్టాదారు పాసుపుస్తకాలను తీర్చిదిద్ది అందిస్తుందన్నారు. ఈ పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్ కూడా ముద్రించడం జరిగిందన్నారు.
ఈ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే తమ భూమి ఎక్కడ ఉన్నది అనేది రైతులకు వివరాలు తెలుస్తాయన్నారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసుకుని జిపిఎస్ తో భూమి ఎక్కడ ఉందో అక్కడికి నేరుగా వెళ్ళిపోవచ్చన్నారు. అంతటి టెక్నాలజీని ఈ పాస్ పుస్తకాలతో ప్రభుత్వం అందించడం జరిగిందన్నారు. తప్పులన్నీ సరిదిద్దడం జరిగిందన్నారు.
జొన్నాడ లో 3028 ఎకరాల భూమి ఉందన్నారు. భూమి హక్కుదారులు ( ఎల్పీఎంలు)2036 మంది ఉన్నారన్నారు. 1628 మందికి పాసు పుస్తకాలు ప్రింట్ చేసి అప్పగిస్తున్నామన్నారు. ఈ 1628 రికార్డులు పూర్తిగా ఎటువంటి తప్పులు లేకుండా, సరిచేసి అందించడం జరిగిందన్నారు. గతంలో దొర్లిన తప్పులు అన్నీ సరిచేసి రైతుల దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఈ పాస్ పుస్తకాలు అందించడం జరిగిందన్నారు.
రీ సర్వే పేరుతో జరిగిన తప్పులే కాకుండా అప్పట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి రైతులను ఇబ్బందులు పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగిందన్నారు. గతంలో పాస్ పుస్తకాల్లో దొరికిన తప్పులను ఎక్కడ సరి చేసుకోవాలో తెలిసేది కాదని, ఇప్పుడు ఆర్డీవోలకు, తాసిల్దార్లకు అధికారాన్ని కట్టబెట్టి ప్రభుత్వం రైతులకు మేలు చేసిందని ఎమ్మెల్యే తెలియజేశారు.




