Razole: బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే దేవ వరప్రసాద్!
Razole: కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్యాస్ లీకేజీ ఘటన బాధితులకు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ 50 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు.
Razole: బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే దేవ వరప్రసాద్!
Razole: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, ఇరుసుమండ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రభావితమైన బాధిత కుటుంబాలకు అండగా నిలిచే చర్యల్లో భాగంగా 712 మంది కార్డుదారులకు 50 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఇరుసుమండ గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ స్వయంగా బియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్యాస్ లీకేజీ ఘటనతో ఇరుసుమండతో పాటు గుబ్బలపాలెం, లక్కవరం, చింతలపల్లి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు.
గతంలో ఈ నాలుగు గ్రామాల్లోని 6,113 ఇళ్లకు ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్యాస్ లీకేజీ కారణంగా నష్టపోయిన చెట్లు, వరి పంటలకు కూడా పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే పంటలు, చెట్లకు సంబంధించిన నష్టపరిహారం చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.




